
బిగ్‌బాస్-6 తెలుగు సీజన్ చప్పగా సాగింది. టీఆర్పీ రేటింగ్‌లు కూడా దారుణంగా వచ్చాయని ప్రచారం సాగుతోంది. అయితే ఈ సీజన్లో అందరికీ ఓ అంశం షాక్‌ను కలిగించింది. కొన్నివారాలుగా రేవంత్ విన్నర్ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఫినాలే ఎపిసోడ్ జరుగుతున్న తీరు కూడా ఇలాగే సాగింది. అయితే చివర్లో హోస్ట్ నాగార్జున ట్విస్ట్ ఇచ్చాడు. రేవంత్ కంటే శ్రీహాన్‌కు ఎక్కువ ఓట్లు వచ్చినట్లు ప్రకటించాడు. కానీ అప్పటికే శ్రీహాన్ నాగ్ ఇచ్చిన ఆఫర్‌ను అంగీకరించడంతో రేవంత్ విజేతగా నిలిచాడు. కానీ తనకు తక్కువ ఓట్లు వచ్చాయన్న నాగార్జున మాటలతో రేవంత్ ఫేస్‌లో డల్‌నెస్ కనిపించింది. ఈ విషయంపై రేవంత్ కూడా స్పందించాడు. చాలా తక్కువ శాతం ఓట్లు అని చెప్పినప్పుడు ఈ విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. శ్రీహాన్ ఎవరో కాదని.. తన బెస్ట్ ఫ్రెండ్ అని వివరించాడు.
మరోవైపు తనను అందరూ అగ్రెసివ్ అని అంటున్నారని.. కానీ తాను ఎలాంటి నటనలకు పోకుండా బయట ఎలా ఉంటానో బిగ్‌బాస్ హౌస్ లోపల కూడా అలాగే ఉన్నానని.. టాస్కుల్లో 100 శాతం ప్రదర్శన ఇచ్చానని రేవంత్ అన్నాడు. తాను గతంలో ఇండియన్ ఐడల్ గెలిచినప్పుడు కూడా తనను ఇలాగే అన్నారని.. కానీ అప్పుడు తన వ్యక్తిత్వం గురించి ఆడియన్స్‌కు తెలియదని.. ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో ప్రత్యక్షంగా చూశారని.. దీంతో తనను అందరూ అర్ధం చేసుకుని ఉంటారని రేవంత్ అభిప్రాయపడ్డాడు. తనకు వచ్చిన ట్రోఫీని తన కుమార్తెకు అంకితం చేస్తున్నట్లు రేవంత్ చెప్పాడు. తనకు డబ్బు కంటే ట్రోఫీనే ముఖ్యమని.. బిగ్‌బాస్ విన్నర్ ఎవరు అంటే అందరూ తనపేరు మాత్రమే చెప్తారని.. డబ్బు ఈరోజు కాకపోతే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చని రేవంత్ వివరించాడు. తనతో పాటు అందరూ బాగా ఆడారని.. బిగ్‌బాస్ హౌస్ తనకు ఎంతో మంది స్నేహితులను ఇచ్చిందన్నాడు.
అటు గతంలో తాను బిగ్‌బాస్ షోలను చూడలేదని.. ఒకవేళ చూసి ఉంటే ఇలాగే చేయాలి అనే భావనలో తనలో ఉండేదని రేవంత్ చెప్పాడు. గీతామాధురి, శ్రీరామచంద్ర సింగర్స్ కాబట్టి వాళ్లు పాల్గొన్న సీజన్లలో ఫినాలే గ్లింప్స్ మాత్రమే చూశానని రేవంత్ వివరించాడు. రేవంత్‌కు బిగ్‌బాస్ హౌస్‌కు వెళ్లినందుకు వారానికి రూ.60వేల నుంచి రూ.80 వేల వరకు ఇచ్చేందుకు నిర్వాహకులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా చూసుకున్నా మొత్తం పదిలక్షల రూపాయలు రెమ్యునరేషన్ కింద వస్తుంది. అంటే క్యాష్ రూపంలో 20 లక్షల రూపాయలు, పది లక్షల కారు, 30 లక్షల ఖరీదు ప్లాటు… మొత్తం 60 లక్షల వరకు రేవంత్ సంపాదించాడు. మూడు నెలలకు ఇది తక్కువ సంపానేమీ కాదు. అటు కీర్తి తరహాలో శ్రీహాన్ సూట్‌కేసు వద్దనుకుంటే పరిస్థితి మరోలా ఉండేది. అతనికే ఎక్కువ ఓట్లు పడ్డాయని నాగార్జున చెప్పారు కాబట్టి అతడే విన్నర్ అయ్యే వాడు. రేవంత్‌కు అప్పుడు మొండి చెయ్యే మిగిలేది. కీర్తి, శ్రీహాన్ తీసుకున్న నిర్ణయాలు రేవంత్ లాభపడేలా చేశాయి.