
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్. ఆరు పదుల వయసు దాటిన యాక్షన్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులతో నాగార్జున ఔరా అనిపించుకుంటున్నాడు. ఆఫీసర్, వైల్డ్ డాగ్ మూవీస్ తరహాలో ఘోస్ట్ కూడా పూర్తి మాస్ మూవీగా తెరకెక్కింది. ఈ సినిమాకు గరుడవేగ ఫేం ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలతో దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ మూవీ తొలిరోజు యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే వసూళ్లు రాబట్టడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది. కథ, కథనం రొటీన్‌గా ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా రుచించడం లేదు. తొలివారం ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.4 కోట్ల షేర్ వసూళ్లు మాత్రం రాబట్టగలిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.22 కోట్లు సాధించాల్సి ఉంది. అయితే ఈ ఫిగర్ అందుకోవడం కష్టమేనని చెప్పాలి.
ది ఘోస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను చూస్తే నైజాంలో రూ.5.5 కోట్లు, సీడెడ్‌లో రూ.2.5 కోట్లు, ఏపీలోని మిగతా ప్రాంతాలన్నీ కలిపి రూ.8 కోట్లకు ఈ సినిమాను విక్రయించారు. కర్ణాటకలో రూ.65 లక్షలు, హిందీతో పాటు రెస్టాఫ్ ఇండియాలో రూ.2 కోట్ల మేర ప్రి రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే తొలివారం రూ.4 కోట్లు మాత్రమే సాధించి ఉసూరుమనిపించింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో నాగార్జున ఇంటర్‌పోల్ అధికారిగా నటించాడు. నాగార్జునకు జోడీగా సోనాల్ చౌహన్ హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై సునీల్ నారంగ్, పుస్కురి రామ్‌మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించారు.
అయితే ఈ సినిమా తమిళంలో సేఫ్ వెంచర్‌గా నిలిచిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ది ఘోస్ట్ చిత్రం తమిళంలో రచ్చన్ పేరుతో రిలీజైంది. ఈ చిత్రం కోలీవుడ్‌లో బ్రేక్ ఈవెన్ సాధించి హిట్‌గా నిలిచిందని ప్రముఖ కోలీవుడ్ సినీ విశ్లేషకుడు రాజశేఖర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే దీనిపై పలువురు మాత్రం ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో తక్కువ రేటుకే కొన్నారని.. దాంతో బ్రేక్ ఈవెన్ సాధించిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో నిజమెంతుందో తెలియదు కాదు అక్కినేని ఫ్యాన్స్‌కు మాత్రం ఈ న్యూస్ కాస్త ఊరటనిస్తుందనే చెప్పాలి. ఈ సినిమాలో నాగార్జున సోదరిగా గుల్ పనాగ్, మేనకోడలిగా అనికా సురేంద్రన్ నటించారు. ఈ మూవీలో నటీనటులు ఎమోషన్స్ పండించడంలో ఎందుకో విఫలమయ్యారని, కావాలని ఎమోషన్స్ తెచ్చి పెట్టుకుని నటించినట్లు ఉందని సినిమా చూసిన అభిమానులు చర్చించుకుంటున్నారు. అటు ది ఘోస్ట్ మూవీని హిందీలో కాస్త ఆలస్యంగా విడుదల చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.