
కొద్దిరోజులుగా సీనియర్ నటుడు నరేష్ వ్యక్తిగత విషయం గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి. నటి పవిత్ర లోకేష్‌ను నరేష్ పెళ్లి చేసుకుంటున్నట్లు పుకార్లు వినిపించాయి. అయితే వాళ్లిద్దరూ సహజీవనం మాత్రమే చేస్తున్నారని.. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని కూడా టాక్ వినిపించింది. కొన్నాళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్‌తో నరేష్ సన్నిహితంగా ఉంటున్నాడు. అదే సమయంలో ఇద్దరూ మహాబలేశ్వరంలో ఓ స్వామిజీ మఠాన్ని సందర్శించారు. దీంతో వీళ్లిద్దరి పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో నరేష్ మూడో భార్య రమ్య నరేష్, పవిత్ర లోకేష్ మధ్య బంధంపై నోరువిప్పారు. నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ దానికి సంబంధించి వారిద్దరూ అధికారిక ప్రకటన చేయలేదని రమ్య పేర్కొన్నారు. తనకు, నరేష్‌కు 2010లో వివాహం జరిగిందని.. తమకు 9 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడని రమ్య వివరించారు.
మరోవైపు నరేష్‌కు ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయనే విషయం తనకు పెళ్లయిన తర్వాత తెలిసిందని రమ్య ఆరోపించారు. నరేష్ గురించి గాసిప్స్ వచ్చిన సమయంలో అతడు తన దగ్గరకు వచ్చి ఇవన్నీ ఫేక్ అని నమ్మించేవాడని ఆమె పేర్కొన్నారు. తమ అత్తగారు విజయనిర్మల ఉన్నప్పటి నుంచి ఇదంతా జరుగుతోందని.. ఎప్పుడైతే పవిత్ర లోకేష్ తమ మధ్యకు వచ్చిందో అప్పటి నుంచి తమ కుటుంబానికి ఇబ్బందులు మొదలయ్యాయని మండిపడ్డారు. ఇటీవల నరేష్ తనకు విడాకుల నోటీసు పంపించారని, చట్ట ప్రకారం దానికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని.. ప్రస్తుతం కోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉందన్నారు. అయితే తమ ఇద్దరికీ గొడవ జరిగిన ప్రతిసారీ నరేష్ కన్నీళ్లతో క్షమాపణ చెప్పేవాడని వివరించారు. కానీ నరేష్ అనవసరంగా తన కుటుంబం గురించి కామెంట్స్ చేస్తున్నాడని, నరేష్ మగాడైతే ఆయన కుటుంబం గురించి మాట్లాడుకోవాలని హితవు పలికారు. తమ గొడవల కారణంగా తమ కొడుకు ఇబ్బంది పడకూడదని అంతా సహిస్తున్నట్లు రమ్య మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే నరేష్, పవిత్ర లోకేష్ మధ్య సంబంధంపై కన్నడ మీడియా స్ట్రింగ్ ఆపరేషన్ చేయగా తాము రిలేషన్‌షిప్‌లో ఉన్నామని పవిత్ర లోకేష్ వివరించింది. తమ బంధానికి కృష్ణ ఫ్యామిలీ నుంచి ఆమోదం కూడా ఉందని ప్రకటించింది. మహేష్ తండ్రి కృష్ణగారితో పాటు నరేష్, తాను ఫార్మ్ హౌస్‌లో ఉంటున్నామని తెలిపింది. నరేష్‌కు మూడో భార్యతో విడాకుల ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో పెళ్లి గురించి ఆలోచిస్తున్నామని పేర్కొంది. పవిత్ర లోకేష్ ప్రకటనతో త్వరలో నరేష్ నాలుగో పెళ్లి చేసుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. అటు తన మూడో భార్య రమ్య ఆరోపణలపై స్పందించిన నరేష్ గురువారం నాడు బెంగుళూరులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. కానీ విలేకరుల సమావేశంలో కన్నడ పవర్ టీవీ ఛానల్ ఉంటే తాను మాట్లాడనంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతడు కారులో బయటకు వెళ్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాను తప్పకుండా అన్ని విషయాలు చెబుతానని.. తనకు న్యాయం కావాలని నరేష్ చెప్తుండటం ఈ వీడియోలో కనిపిస్తోంది.