
కొన్ని రోజులుగా మీడియాలో సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ మధ్య బంధం హాట్ టాపిక్‌గా మారింది. వీళ్లిద్దరూ సహజీవనం చేస్తున్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పవిత్ర లోకేష్ మీడియా ముందుకు వచ్చి నరేష్‌తో సంబంధంపై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది. తనకు నరేష్ మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదంటూ వీడియోలో చెప్పుకొచ్చింది. నరేష్ భార్యకు నిజంగా భర్త కావాలంటే హైదరాబాద్‌లో అడిగితే న్యాయం జరుగుతుంది కానీ.. బెంగుళూరు వెళ్లి మీడియా ముందు రచ్చ చేయడం చేస్తే ఎవరి పరువు పోతుందో గ్రహించాలంటూ హితబోధ చేసింది. తాను వాళ్ల మధ్యకు వెళ్లినట్లు, రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు, పెళ్లి చేసుకున్నట్లు తఏవేవో మాట్లాడుతూ కర్ణాటక మీడియా ముందు ఆరోపించడం తనను ఎంతగానో బాధించిందని పవిత్ర లోకేష్ ఆవేదన వ్యక్తం చేసింది.
నరేష్ తెలుగులో ఫేమస్ యాక్టర్ అని.. కానీ ఆయన భార్య రమ్య బెంగళూరు వెళ్లి కర్ణాటక మీడియాతో మాట్లాడమేంటని పవిత్ర లోకేష్ ప్రశ్నించింది. ఆమెకు సమస్య ఉంటే హైదరాబాద్‌లో చెప్తే పెద్దవాళ్లు వచ్చి న్యాయం చెప్తారని… కానీ బెంగళూరు వెళ్లి చెప్పడం తప్పనిపిస్తుందని.. దయచేసి ఈ విషయంలో మీడియా తనకు, నరేష్‌కు సపోర్ట్ చేయాలని కోరింది. నరేష్ ఎవరో, ఆయన ఫ్యామిలీ ఎలాంటిదో, ఆయనతో తనకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని పవిత్ర లోకేష్ అభిప్రాయపడింది. తనను బ్యాడ్ చేయడానికి మాత్రమే నరేష్ భార్య రమ్య బెంగళూరుకు వెళ్లి ప్రెస్‌మీట్లు పెడుతుందని విమర్శలు చేసింది. గతంలో నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. తొలుత సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వీళ్లిద్దరికీ నవీన్ జన్మించిన తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయారు. తర్వాత రెండో పెళ్లి చేసుకోగా అది కూడా పెటాకులైంది. అనంతరం 50 ఏళ్ల వయసులో ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్యను 2010 డిసెంబరు 3న హిందూపురంలో నరేష్ వివాహం చేసుకున్నాడు.
అయితే ప్రస్తుతం ఇటు పవిత్ర లోకేష్, అటు నరేష్ ఇద్దరూ సాన్నిహిత్యంగా ఉండటం వాళ్ల కుటుంబాల్లో చిచ్చు రేపిందనే చెప్పాలి. వీళ్లిద్దరూ సహజీవనం చేస్తున్నారంటూ ఆరోపణలు రావడంతోనే నరేష్ మూడో భార్య రమ్య, పవిత్ర లోకేష్ భర్త సుచేంద్ర ప్రసాద్ మీడియా ముందుకు వచ్చి తమ బాధను వెళ్లగక్కుతున్నారు. నరేష్‌తో తనకు సత్సంబంధాలు లేవని.. తనకు నరేష్ ఇప్పటివరకు విడాకులు ఇవ్వలేదని ఆయన భార్య రమ్య ఆరోపించింది. తనకు విడాకులు ఇవ్వకుండా ఇప్పుడు పవిత్ర లోకేష్‌ను మ్యారేజ్ ఎలా చేసుకుంటారని ఆమె ప్రశ్నించింది. ఒకవేళ ఆయనకు మ్యారేజ్ అయితే తన పరిస్థితి ఏంటని నిలదీసింది. మూడేళ్ల నుంచి తమ మధ్య విభేదాలున్నాయని.. న్యాయపరంగా విడాకులు తీసుకోవడమనేది చాలా పెద్ద ప్రక్రియ అని… అందుకు సమయం పడుతుందని రమ్య రఘుపతి వెల్లడించింది. అటు పవిత్ర లోకేష్‌పై ఆమె భర్త సుచేంద్ర ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. తన వద్ద డబ్బు లేదని ఇద్దరు పిల్లలున్నా కూడా పవిత్ర లోకేష్ తనను వదిలేసి వెళ్లిపోయిందని ఆరోపించారు. ఆమెకు కాపురాలు కూల్చటం అలవాటేనని, ఆశలు ఎక్కువే అని.. అందుకనే తనను వదిలేసి వెళ్లిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.