
హీరోయిన్ నయనతార ఎట్టకేలకు వివాహం చేసుకుంది. గతంలో ప్రభుదేవా, శింబు లాంటి హీరోలతో సహజీవనం చేసిన నయనతార ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను పెళ్లాడింది. కొన్నేళ్లు ప్రేమలో ఉన్న వీరిద్దరూ తమ ప్రేమను ఏడడుగుల బంధంగా మార్చుకున్నారు. జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలో ఓ హోటల్ వేదికగా వీరిద్దరి వివాహం అత్యంత ఘనంగా జరిగింది. షారుఖ్ ఖాన్, నిర్మాత బోనీ కపూర్, డైరెక్టర్ అట్లీ, కార్తీ, సూర్య, రజినీ కాంత్, విజయ్ దళపతితో పాటు పలువురు సినీ ప్రముఖులు వీరి పెళ్లికి హాజరయ్యారు. ఇలా పెళ్లయిందో లేదో అప్పుడే హీరోయిన్ నయనతార తన భర్తకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయిందట. ఓ కొత్త బంగ్లాను విఘ్నేశ్ శివన్ పేరు మీద రాసిపెట్టిందట. దీని విలువ అక్షరాలా రూ.20 కోట్లు అని ప్రచారం జరుగుతోంది.
చెన్నైలోని అత్యంత ఖరీదైన ఏరియాలోని రూ.20 కోట్లు పెట్టి ఓ ఇంద్రభవనం లాంటి ఇంటిని నయనతార కొనుగోలు చేసిందట. ఆ ఇంటిని తన భర్త పేరిట రిజిస్ట్రేషన్ చేయించి బహుమతిగా ఇచ్చిందట. అలాగే తన భర్త సోదరి ఐశ్వర్యకు సైతం దాదాపు 24 తులాల బంగారు నగలను గిఫ్ట్‌గా ఇచ్చిందని సమాచారం. దీంతో పాటు దగ్గరి బంధువులకు సైతం నయనతార విలువైన వస్తువులను బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు విఘ్నేష్ శివన్ కూడా నయనతార పెళ్లిలో సింగారించుకునేందుకు దాదాపు మూడు కోట్ల విలువైన బంగారం కొనుగోలు చేసి ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. దీంతో పాటు రూ.5 కోట్లు విలువ చేసే డైమండ్ రింగ్ కూడా నయనతార చేతికి తొడిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పెళ్లికి వచ్చిన బంధువులు సైతం నూతన వధూవరులకు కళ్లు చెదిరే బహుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
అటు ఈ పెళ్లిని నయనతార-విఘ్నేష్ శివన్ అందరికీ గుర్తుండిపోయేలా చేయాలని భావించారు. అందుకోసం అన్నిదానాల్లో కన్నా గొప్పదైన అన్నదానాన్ని ఎంచుకున్నారు. తమిళనాడు వ్యాప్తంగా నిరుపేదలకు, వృద్ధులకు, అనాధలకు, చిన్నారులకు విందుభోజనం వడ్డించారు. సుమారు లక్ష మందికి భోజనం అందించారు. దీంతో వీరు చేసిన మంచి పనిని అందరూ ప్రశంసిస్తున్నారు. అయితే నయనతార పెళ్లి చేసుకున్న మరుసటిరోజే వివాదంలో చిక్కుకుంది. తిరుమల ఆలయం ముందు ఫోటో షూట్‌లో పాల్గొనడం, మాఢ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగడం వంటివి చేయడంతో విమర్శలను ఎదుర్కొంది. ఈ వ్యవహారంపై టీటీడీ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. నయనతార చెప్పులతోనే మాడ వీధుల్లో సంచరించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా వ్యవహరించిన నయనతార దంపతులకు నోటీసులు ఇచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. అయితే తిరుమలలో తమకు తెలియక చేసిన తప్పుకు క్షమించాలని విఘ్నేష్ శివన్ బహిరంగ లేఖ రాయడంతో ఈ వివాదం సద్దుమణిగింది.