
మాస్ మహరాజా రవితేజ లేటెస్టుగా నటించిన ధమాకా మూవీ క్రిస్మస్ కానుకగా ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఈ ఏడాది ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాల తర్వాత రవితేజ నుంచి వచ్చిన సినిమా ఇదే. ఆ రెండు సినిమాలు నిరాశపరచడంతో ధమాకా మూవీపై రవితేజ కూడా భారీగా ఆశలు పెట్టుకున్నాడు. అయితే తొలిరోజు ఈ మూవీకి మిక్సుడ్ టాక్ వచ్చింది. కొందరు బాగుందని ప్రశంసలు కురిపిస్తే మరికొందరు రొటీన్ స్టోరీ అంటూ పెదవి విరుస్తున్నారు. దీంతో డివైడ్ టాక్‌తో ధమాకా మూవీ రన్ అవుతోంది. ఈ మూవీలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్గా నటించింది. త్రినాథరావు నక్కిన ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. మీడియం బడ్జెట్ రేంజ్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు ముందే రూ.18.30 కోట్ల బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. నైజాంలో రూ.5.5 కోట్లు, సీడెడ్‌లో రూ.2.5 కోట్లు, ఆంధ్రాలో రూ.8 కోట్లు, తెలంగాణ, ఏపీలో మొత్తంగా రూ.16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కర్ణాటక, ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియాలో మరో రూ.2.30 కోట్ల బిజినెస్ జరిగింది.
మొత్తంగా ధమాకా చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేయాలంటే రూ.19 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే తొలిరోజు డివైడ్ టాక్ రావడంతో తొలి వారం ఈ చిత్రం ఎంత వసూలు చేస్తుందన్న విషయంపై ఆసక్తి నెలకొంది. హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా రవితేజ వరుసగా సినిమాలను చేస్తున్నాడు. అంతేకాకుండా వాటిని ఏకకాలంలో కూడా ఫినిష్ చేస్తున్నాడు. క్రాక్ తర్వాత ఏకంగా మూడు సినిమాలను అనౌన్స్ చేయగా ఆ మూడు సినిమాలు ఇప్పటికే విడుదలయ్యాయి. అయితే మంచి ఫలితాలను మాత్రం సాధించలేకపోయాయి. దీంతో ధమాకా ఫలితం రవితేజ కెరీర్‌కు కీలకంగా మారింది. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ మూవీలోని కథలో కొత్తదనం లేదని సినిమా చూసిన వాళ్లు చెప్తున్నారు. కథ లేకుండా సినిమా తీయవచ్చని ఎవరూ చెప్పలేదు. సినిమాకి పునాది కథే. దానిపై ఎన్ని అందమైన ఇటుకలు పేర్చనివ్వండి.. పునాది గట్టిగా లేకపోతే అది అచ్చంగా ఇసుక మేడే అవుతుంది.
ధమాకా మూవీకి ఫస్టాఫ్ ప్లస్ కాగా సెకండాఫ్ మైనస్‌గా మారింది. ఎన్నో సినిమాల్లో చూసిన ఫార్ములాను ఈ సినిమాలోనూ చూపించడంతో రొటీన్‌గా ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. కంపెనీ టేకోవర్ లాంటి కాన్సెప్టులు ఇప్పటికే త్రివిక్రమ్ సినిమాల్లో చూశామని.. రచయిత ప్రసన్నకుమార్ బెజవాడ మరోసారి అలాంటి కథనే తిప్పి తిప్పి రాసుకున్నాడని విమర్శిస్తున్నారు. రచయిత గాడితప్పడంతో దర్శకుడు త్రినాథరావు కూడా ఏం చేయలేకపోయాడు. అయితే ఈ మూవీకి హీరోయిన్ ప్లస్ అని అంటున్నారు. పెళ్లి సందD సినిమాతో ఒక్కసారిగా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్లో వరుసగా అవకాశాలను దక్కించుకుంటోంది. పెళ్లి సందD సినిమాలో యాక్టింగ్‌తో పాటు తన అందచందాలతో వావ్ అనిపించింది. అయితే శ్రీలీల మాత్రం కేవలం గ్లామర్‌ను మాత్రమే నమ్ముకోలేదని, నటనతోను ఆకట్టుకోవాలని అంటోంది. ధమాకాతో పాటు శ్రీలీల చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.