
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య విపరీతమైన పోటీ నెలకొని ఉంది. అందులో ఒకరు తమన్ అయితే మరొకరు దేవిశ్రీప్రసాద్. అగ్రహీరోల సినిమాలకు వీరిద్దరూ మాత్రమే సంగీతం అందిస్తున్నారు. గత ఏడాది ఘనవిజయం సాధించిన పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుందంటే దానికి కారణం అందులోని పాటలు. ఇక తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అఖండ సినిమాతో అందరి కళ్లను తనవైపుకు తిప్పుకున్నాడు. ఆ సినిమా నుంచి ప్రతి భారీ బడ్జెట్ సినిమాకు తమన్ మంచి ఛాయిస్ అవుతున్నాడు. రాధే శ్యామ్, గాడ్ ఫాదర్ సినిమాలను తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో తమన్ నిలబెట్టాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది.
దీపావళి కానుకగా వాల్తేరు వీరయ్య సినిమా నుంచి టైటిల్ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే ఈ టీజర్ అంతా బాగున్నా బ్యాక్ గ్రౌండ్ స్కోరు బాగోలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ టైటిల్ టీజర్‌లో మ్యూజిక్ దేవిశ్రీ స్థాయికి తగ్గట్లు లేదని మెగా అభిమానులు ఆరోపిస్తున్నారు. కొంతకాలంగా దేవిశ్రీప్రసాద్ ఫామ్‌లో లేకపోయినా మెగాస్టార్ సినిమాలకు అతడు మంచి ఊపు తెచ్చే సంగీతం ఇస్తాడని అభిమానులు భావించారు. కానీ తమను డీఎస్పీ తీవ్రంగా నిరాశపరిచాడని మెగా అభిమానులు మండిపడుతున్నారు. గతంలో శంకర్‌దాదా ఎంబీబీఎస్, అందరి వాడు, శంకర్ దాదా జిందాబాద్, ఖైదీ నంబర్ 150 సినిమాలకు దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన పాటలు ఉర్రూతలూగించాయని గుర్తుచేస్తున్నారు. ఓవైపు తమన్ దూసుకుపోతుంటే చిరంజీవి పట్టుబట్టి మరీ దేవిశ్రీకి అవకాశం ఇప్పిస్తే ఇలా చేస్తాడా అంటూ పలువురు మండిపడుతున్నారు. కొన్ని తమిళ సినిమాల మిక్సింగ్ నేపథ్యంలో ఈ టైటిల్ వీడియో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉందన్న విమర్శలు కూడా వస్తున్నాయి.
కాగా వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. చిరు, శ్రుతి కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా ఇదే. ముఠామేస్త్రి, అందరివాడు లాంటి సినిమాల తర్వాత పూర్తి మాస్ నేపథ్యంలో చిరంజీవి నటిస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీతో బాస్ ఈజ్ బ్యాక్ అని అనిపించుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమా చిరు కెరీర్‌లో 154వ సినిమాగా వస్తోంది. దీపావళి కానుకగా విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ టీజర్‌ను గమనిస్తే.. ఎక్కడ్రా మీ అన్నయ్య వస్తే ఏదో అయిపోతుందని అన్నారు ఎక్కడ్రా అని విలన్ అంటుంటాడు. వెంటనే బాంబులో హార్బర్ మోతక్కుతుంది. అసలు అలా జరగటానికి కారణం ఎవరా అనేలా సీన్స్ చూపించారు. స్టైల్‌గా కళ్లజోడు పెట్టుకుని బీడి తాగుతున్న చిరంజీవి .. వాల్తేరు వీరయ్యగా కనిపించారు. ఇంకా ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటే లైక్, షేర్, సబ్ స్క్రైబ్ చేయడంటూ చివరలో చిరంజీవి చెప్పిన డైలాగ్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. వాల్తేర్ వీరయ్యలో చిరంజీవి తమ్ముడు పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నాడు. చిరంజీవిలోని ఈజ్, అదిరిపోయే మేనరిజం, యాటిట్యూడ్ అన్నీ కూడా మెప్పించాయి.