
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆహా ఓటీటీ శుభవార్త అందించింది. నందమూరి నటసింహం బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షోకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ నడుస్తోంది. ఈ షోకు ఇప్పటికే పలువురు ప్రముఖ హీరోలు వచ్చి సందడి చేశారు. ఈ సీజన్లో బాలయ్య టాక్ షో చప్పగా సాగుతుందని అందరూ అనుకుంటున్న వేళ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రావడంతో ఒక్కసారిగా అన్‌స్టాపబుల్-2కు బూస్టప్ వచ్చింది. ప్రభాస్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఏకంగా ఆహా యాప్ క్రాష్ అయ్యేంతలా ఈ టాక్ షోను వీక్షించేందుకు పోటీ పడ్డారు. దీంతో ప్రభాస్‌తో చిత్రీకరించిన ఎపిసోడ్లను రెండు భాగాలుగా ఆహా యాజమాన్యం స్ట్రీమింగ్ చేసింది. ఇప్పుడు అందరి చూపులు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌పైనే ఉన్నాయి. గతంలోనే ఈ ఎపిసోడ్ చిత్రీకరణ జరిగినా ఇప్పటివరకు స్ట్రీమింగ్ చేయలేదు. సంక్రాంతి సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఈ టాక్ షోలో పాల్గొన్నాడని తెలుసుకుని, ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
పవర్‌స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవర్ఫుల్ ఎపిసోడ్‌కు సంబంధించిన పవర్ టీజర్‌ను ఈరోజు రాత్రి 8 గంటలకు ఆహా రిలీజ్ చేసింది. టీజర్ ప్రారంభంలో భీమ్లా నాయక్ మూవీ సాంగ్‌ను ప్లే చేసింది. ఆ తర్వాత బాల అని పిలవమని చెప్పినా ఎందుకు పిలవడం లేదని పవన్‌ను బాలయ్య ప్రశ్నిస్తాడు. ఓడిపోవడానికి సిద్ధమే కానీ ఆ మాట పిలవలేనని పవన్ అంటాడు. అప్పుడు ఈ పాలిటిక్స్ వద్దంటూ బాలయ్య సరదాగా అంటాడు. ఇటీవల రాజకీయంగా విమర్శల్లో వాడి వేడి పెరిగినట్లు ఉన్నాయని బాలయ్య అడగ్గా.. తాను చాలా పద్ధతిగా మాట్లాడుతున్నానని పవన్ నవ్వుతూ చెప్పడం ఈ టీజర్‌కు హైలెట్‌గా నిలిచింది. అన్నయ్య చిరంజీవి దగ్గర నుంచి నేర్చుకున్నవి ఏంటి.. వద్దనుకున్నవి ఏంటని బాలయ్య ప్రశ్నిస్తాడు. అయితే పవన్ ఏం సమాధానం చెప్పాడో టీజర్లో చూపించలేదు. ఆ తర్వాత వదినకు ఫోన్ చేసి ఇదే తన లాస్ట్ సినిమా అని చెప్పానని పవన్ అంటాడు. అయితే అది ఏ సినిమా తర్వాతో టీజర్లో చూపించలేదు.
మరోవైపు ఏపీలో నీ ఫ్యాన్ కాని వాడు లేడు.. కానీ ఆ అభిమానం ఓట్ల రూపంలో ఎందుకు రాలేదని బాలయ్య పవన్‌ను ప్రశ్నించాడు. దీనికి పవన్ ఎలా స్పందించాడో తెలుసుకోవాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే. ఈ ఎపిసోడ్‌ను త్వరలోనే ఆహా స్ట్రీమింగ్ చేయనుంది. టీజర్ చివర్లో తాము బ్యాడ్ బాయ్స్ అని బాలయ్య చెప్పడం కొసమెరుపు. మొత్తానికి పవర్ ఫుల్ టీజర్ విడుదల కావడంతో అభిమానులు ఒక్కసారిగా ‘పవన్ కల్యాణ్ ఆన్ ఆహా’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తున్నారు. ఈ టీజర్ రిలీజ్ కావడంతోనే వారు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నారు. బాలయ్య ప్రశ్నలకు పవన్ సమాధానాలు ఎలా ఉండబోతున్నాయా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. వీర సింహారెడ్డితో వీరమల్లు సందడి ఎలా ఉంటుంది అనేది చెప్పడానికి ఈ టీజర్ చిన్న ఉదాహరణ మాత్రమే. తెలుగు సినిమా ప్రేక్షకులు, రాజకీయ వర్గాలతో పాటు నందమూరి ఫ్యాన్స్, మెగా అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఎపిసోడ్‌కే క్రాష్ అయిన ఆహా యాప్ పవర్‌స్టార్ ఎపిసోడ్‌కు ఏమవుతుందో మరికొద్దిరోజుల్లో తెలిసిపోతుంది.