
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ లెజెండరీ నటుడు గుర్తింపు పొందారు. అయితే నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విశ్వనటుడు నటించిన సినిమా విడుదలైంది. విశ్వరూపం-2 తర్వాత కమల్ చిత్రాలేవీ రిలీజ్ కాలేదు. కొన్ని సినిమాల నిర్మాణం మొదలైనా వివిధ దశల్లో ఆగిపోయాయి. తాజాగా కమల్‌హాసన్ నటించిన విక్రమ్ సినిమా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను కమల్ తన సొంత బ్యానర్‌లో నిర్మించారు. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. తెలుగులో ఈ చిత్రాన్ని హీరో నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ తరఫున సుధాకర్ రెడ్డి విడుదల చేశారు. 1986లో వచ్చిన ‘ఏజెంట్ విక్రమ్’ లోని కమల్ హాసన్ పాత్రను పొడిగిస్తూ వచ్చిన సినిమా ఇది. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో రివెంజ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది.
తొలిరోజే ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. ఏపీ, తెలంగాణలో తొలిరోజు రూ.3 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ మూవీ తెలుగు హక్కులను మొత్తం రూ.6 కోట్లకు కొనుగోలు చేయగా తొలిరోజే రూ.3 కోట్లు రాబట్టడంతో బయ్యర్లు హ్యాపీగా ఫీలవుతున్నారు. సినిమాకు మంచి టాక్ రావడంతో రెండు రోజుల్లోనే కమల్ హాసన్ విక్రమ్ సినిమా లాభాల బాట పట్టనుందని ప్రచారం జరుగుతోంది. నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డికి ఈ సినిమాతో దాదాపు రూ.15 కోట్ల లాభం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. గతంలో కార్తీతో ఖైదీ, విజయ్‌తో మాస్టర్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ విక్రమ్ మూవీని కూడా థ్రిల్లర్‌గా నడిపించాడంటూ ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యంగా అనిరుథ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను ఎలివేట్ చేసిందనే టాక్ వినిపిస్తోంది.
మరోవైపు విలన్‌గా విజయ్ సేతుపతి అద్భుతంగా నటించాడని.. మలయాళ నటుడు ఫాహాద్ ఫాజిల్, సూర్య పాత్రలు హైలెట్ అయ్యాయని కూడా టాక్ వస్తోంది. అండర్ వరల్డ్ డాన్ అలెక్స్‌గా సూర్య ఎంట్రీ సినిమాకు గ్రాఫ్‌ను అమాంతం పైకి లేపిందని సినిమా చూసిన వాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. విక్రమ్ సినిమాను రూ.120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్టు సమాచారం. ఈ సినిమా కోసం కమల్ హాసన్ భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. కోలీవుడ్ సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం కమల్ హాసన్ ఏకంగా రూ.50 కోట్ల పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది. అటు కీలక పాత్రలో నటించిన నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమాకు పది కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఫాహద్ పజిల్ నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమిళంలోనూ ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి.