
నందమూరి కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు ఉన్నారు. వారిలో తారకరత్న ఒకడు. కెరీర్ ప్రారంభంలోనే ఒకేసారి 9 సినిమాలకు కొబ్బరికాయ కొట్టిన నటుడు తారకరత్న మాత్రమే. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది. ఇందులో ఎన్ని సినిమాలు పూర్తయ్యాయి.. ఎన్ని విడుదలయ్యాయి అంటే చెప్పడం కష్టమే. 20 ఏళ్ల వయసులోనే తారకరత్న సినీరంగ ప్రవేశం చేశాడు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ఒకటో నంబర్ కుర్రాడు మూవీతో తారకరత్న ప్రేక్షకులను పలకరించాడు. అయితే తారకరత్న హీరోగా చేసిన సినిమాలలో ఒక్కటి కూడా విజయం సాధించలేదు. అందుకే హీరోగా సినిమాలు చేయడమే మానేశాడు. మరోవైపు నిర్మాతలు కూడా తారకరత్న వైపు చూడటం తగ్గించేశారు. తాజాగా తారకరత్న రాజకీయాల వైపు తన దృష్టిని మళ్లించాడు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నాడు. అయితే లోకేష్ పాదయాత్రలో శుక్రవారం నాడు అపశ్రుతి చోటు చేసుకుంది.
కుప్పం సమీపంలోని శ్రీవరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో నందమూరి తారకరత్న కూడా పాల్గొన్నాడు. అయితే యాత్ర ప్రారంభమైన కాసేపటికే తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో చికిత్స నిమిత్తం అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మొదట తారకరత్న శరీరం పల్స్ పూర్తిగా పడిపోయింది. శరీరం పూర్తిగా బ్లూ కలర్‌లోకి మారిపోయిందని వైద్యులు తెలిపారు. 45 నిమిషాల తర్వాత పల్స్ మొదలైందని వివరించారు. బెటర్ ట్రీట్‌మెంట్ కోసం తారకరత్నను బెంగళూరు తరలిస్తామని హీరో బాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఎయిర్ లిప్టింగ్ చేసే అవకాశం లేనందున గ్రీన్ ఛానల్ ద్వారా తారకరత్నను బెంగళూరు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వంతో ఎమ్మెల్యే బాలకృష్ణ చర్చించారని టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి తెలిపారు. అంబులెన్స్కు ఎలాంటి ఆటంకాలు రాకుండా గ్రీన్ ఛానల్ తరహాలో తారకరత్నను తరలించడానికి కర్ణాటక సర్కార్ సహకరిస్తోందని ఆయన చెప్పారు.
అయితే తారకరత్న ఉన్నట్టుండి అస్వస్థతకు గురికావడం పలు అనుమానాలకు తావిస్తోంది. విషప్రయోగం జరిగిందా అనే కోణంలోనూ విచారణ జరుగుతోంది. ప్రస్తుతానికి తారకరత్న గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్ ఉందని.. మిగతా అన్నీ రిపోర్టులు బాగున్నాయని బాలయ్య వెల్లడించాడు. కాగా శుక్రవారం నాడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభమయ్యాక కుప్పం సమీపంలోని ఓ మసీదులో లోకేష్ ప్రార్థన నిర్వహించగా తారకరత్న కూడా పాల్గొన్నాడు. లోకేష్ మసీదు నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు తరలి రావడంతో వారి తాకిడికి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో ఆయన్ను కుప్పంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తారకరత్న కెరీర్ ప్రారంభంలోనే 9 సినిమాలలో నటించే అరుదైన అవకాశాన్ని అందుకున్నాడు. కొన్ని సినిమాలు పెద్ద నిర్మాణ సంస్థలు, అగ్ర దర్శకులతో తారకరత్న సినిమాలను ప్రారంభించాడు. కానీ అందులో చాలా సినిమాలు విడుదల కాలేదు. ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు లాంటి సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. చాలా కాలం తర్వాత రవిబాబు దర్శకుడిగా వచ్చిన అమరావతి సినిమాలో విలన్ అయ్యాడు. మొత్తంగా తారకరత్న 21 సినిమాల్లో నటించాడు. నటుడిగా సారథి తర్వాత ఏ సినిమా చేయలేదు. త్వరలో రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నట్టు చెప్పాడు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్టు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.