
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మహేష్‌బాబు నివాసంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి ఇందిరాదేవి అనారోగ్య సమస్యలతో బుధవారం ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆమెకు 70 ఏళ్లు. ఇందిరాదేవి సూపర్ స్టార్ కృష్ణకు మొదటి భార్య. వీరికి ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో పద్మ, మంజుల, ఇందిరా ప్రియదర్శిని అమ్మాయిలు కాగా.. రమేష్‌బాబు, మహేష్‌బాబు అబ్బాయిలు. ఇందిరా ప్రియదర్శిని భర్త సుధీర్ బాబు తెలుగులో హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ ఏడాది జనవరిలో మహేష్‌బాబు సోదరుడు రమేష్‌బాబు కూడా అనారోగ్యంతో మృతి చెందాడు. ఒకే ఏడాది రెండు దుర్వార్తలు సూపర్‌స్టార్ కుటుంబాన్ని మానసికంగా కుంగదీశాయి.
అయితే ఇటీవల అనారోగ్యంతో ఇందిరాదేవి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అయితే ఆమె త్వరగా కోలుకుని మళ్ళీ ఇంటికి వస్తారని కుటుంబ సభ్యులందరూ భావించారు. కానీ పరిస్థితి విషమించడంతో ఆమె బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. చివరి నిమిషం వరకు వైద్యులు ఆమెను రక్షించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. మహేష్‌బాబు తల్లి ఇందిరా దేవి మరణించడంతో పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా పలువురు హీరోలు సోషల్ మీడియా వేదికగా ఇందిరా దేవికి సంతాపం ప్రకటించారు. శ్రీమతి ఇందిరా దేవి గారు స్వర్గస్తులయ్యారనే వార్త తనను ఎంతో కలిచివేసిందని చిరంజీవి ట్వీట్ చేశారు. అటు తెలంగాణ మంత్రి కేటీఆర్ స్వయంగా మహేష్ నివాసానికి వెళ్లి ఇందిరాదేవికి నివాళులు అర్పించారు.
ఇందిరాదేవి పార్ధివ దేహానికి కృష్ణ, మహేష్‌బాబుతో పాటు ఘట్టమనేని కుటుంబ సభ్యులు, తెలంగాణ మంత్రి కేటీఆర్, నటుడు వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్, ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ వంటి ప్రముఖులు అంతిమ నివాళులర్పించారు. ప్రభాస్‌కు చెందిన యూవీ క్రియేషన్స్ సంస్థ ఇందిరా దేవి మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. హిందూ సంప్రదాయం ప్రకారం ఘట్టమనేని ఇందిరా దేవికి జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రత్యేకంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కాగా సూపర్ స్టార్ కృష్ణ రెండో భార్య విజయనిర్మల కూడా గతంలోనే మృతి చెందారు. రెండేళ్ల క్రితం విజయ నిర్మల కన్నుమూయడం ఒక దెబ్బ అయితే.. ఈ ఏడాది జనవరిలో పెద్ద కుమారుడు రమేష్ బాబు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం.. తాజాగా మొదటి భార్య ఇందిరా దేవి తుది శ్వాస విడవడం బాధాకరం. అటు సూపర్ స్టార్ కృష్ణ.. ఐదేళ్ల క్రితం విడుదలైన శ్రీశ్రీ మూవీ తర్వాత మరే సినిమాలో నటించలేదు. వయసు సహకరించకపోవడంతో ఇంటిపట్టునే ఉంటున్నారు.