
టాలీవుడ్‌లో యంగ్ హీరో నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్న కథలతో సినిమాలు చేస్తూ నిఖిల్ తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ తెరకు పరిచయమైన నిఖిల్ యువత, కార్తీకేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి సినిమాలతో హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ కార్తీకేయ-2 ఈనెల 13న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమా విజయంపై నిఖిల్ గంపెడాశలు పెట్టుకున్నాడు. కరోనా కారణంగా నిఖిల్ సినిమా విడుదలై రెండేళ్లు దాటిపోతోంది. 2019లో వచ్చిన అర్జున్ సురవరం తర్వాత ఇప్పటివరకు నిఖిల్ నటించిన ఏ సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు. దీంతో కార్తీకేయ-2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు తగినన్ని థియేటర్లు ఇవ్వడం లేదని హీరో నిఖిల్ సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. తన సినిమాపై బజ్ ఉన్నా కూడా కొందరు కావాలని థియేటర్లు ఇవ్వడం లేదని నిఖిల్ అంటున్నాడు.
ఆగస్టు 15 సందర్భంగా ఈ వారం టాలీవుడ్‌లో రెండు సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో ఒకటి కార్తీకేయ-2 కాగా మరొకటి నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంటే ఒకరోజు గ్యాప్‌లో నిఖిల్ సినిమా కూడా విడుదలవుతోంది. కానీ అంతకుముందు రోజే అమీర్‌ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా కూడా తెలుగులో విడుదలైంది. ఈ మూవీలో నాగచైతన్య నటించడంతో కొన్ని థియేటర్లను బ్లాక్ చేశారు. గతవారం విడుదలైన బింబిసార, సీతారామం సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో కొన్ని థియేటర్లు బ్లాక్ అయిపోయాయి. మిగిలిన వాటిలో 70 శాతం థియేటర్లు మాచర్ల నియోజకవర్గం సినిమాకు కేటాయించడంతో కార్తీకేయ-2 సినిమాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. మాచర్ల నియోజకవర్గం సినిమా డిస్ట్రిబ్యూటర్లకు కార్తీకేయ-2 సినిమాకు థియేటర్లు ఇవ్వడం లేదని ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. సిటీలలో డొక్కు థియేటర్లను తమకు కేటాయిస్తున్నారని.. బి, సి సెంటర్లలో అయితే తమకు థియేటర్లే లేకుండా చేస్తున్నారని హీరో నిఖిల్ ప్రధానంగా ఆరోపిస్తున్నాడు.
కాగా 2014లో వచ్చిన కార్తీకేయ సినిమాకు సీక్వెల్‌గా కార్తీకేయ-2 సినిమా వస్తోంది. అప్పట్లో కార్తీకేయ మంచి హిట్ సాధించింది. డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఉన్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు మరోసారి ఈ జోనర్‌లోనే కార్తీకేయ-2 తెరకెక్కింది. దర్శకుడు చందూ మొండేటికి థ్రిల్లర్ మూవీస్ బాగా తెరకెక్కిస్తాడనే పేరుంది. స్వామిరారా, దోచెయ్ వంటి సినిమాలు కూడా చందూ మొండేటి దర్శకత్వంలోనే వచ్చాయి. ఇప్పటికే విడుదలైన కార్తీకేయ-2 ట్రైలర్ మంచి ఆసక్తిని రేకెత్తించింది. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయనే టాక్ వచ్చింది. నా వరకు రానంత వరకే సమస్య, నా వరకు వచ్చాక అది సమాధానం అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. కృష్ణుడి ద్వారకకు లింక్ చేసిన విధానం ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేస్తుందనే నమ్మకాన్ని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్‌తో పాటు అనుపమ, అనుపమ్ ఖేర్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి.