
టాలీవుడ్‌లో హీరోయిన్ మీనా సీనియర్ అగ్రహీరోలందరి సరసన నటించింది. ఒకప్పుడు అగ్రతారగా పేరు తెచ్చుకుంది. రోజా, రంభ, రమ్యకృష్ణ వంటి తోటి హీరోయిన్‌లతో పోటీ పడుతూనే టాప్ హీరోయిన్ స్టేటస్‌ను పొందింది. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ మీనా అనేక సినిమాల్లో నటించింది. అయితే ఇటీవల ఆమె భర్త విద్యాసాగర్ ఊపిరితిత్తుల సమస్యతో హఠాన్మరణం చెందాడు. దీంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు మీనా భర్త మృతి పట్ల సంతాపం కూడా ప్రకటించారు. స్టార్ హీరో రజినీకాంత్ స్వయంగా మీనా భర్త అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నాడు. అయితే పావురాల వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే విద్యాసాగర్ మృతి చెందాడని తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. పోస్ట్ కోవిడ్ సమస్యలు మాత్రమే ఆయన మృతికి కారణం కాకపోవచ్చని, పావురాల వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే శ్వాసకోశ సమస్య రెట్టింపు కావడంతో ప్రాణాంతకంగా మారిందని కథనాలలో పేర్కొన్నాయి.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నటి మీనా స్పందించారు. అసలే భర్త దూరమైన బాధలో తాను ఉంటే మీడియాలో వస్తున్న కథనాలు చూసి మరింత ఆవేదన కలుగుతోందని మీనా ఓ భావోద్వేగ లేఖను విడుదల చేశారు. దయచేసి తమ కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించవద్దని ఆమె వేడుకున్నారు. ప్రస్తుతం తామున్న పరిస్థితిని అర్థం చేసుకోవాలని.. తన భర్త మరణం గురించి దయచేసి ఎలాంటి అసత్య ప్రచారాలు ప్రసారం చేయవద్దని మీడియాకు మీనా విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా కష్టకాలంలో తమకు సహాయం చేసినవారికి, తమ కుటుంబానికి తోడుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. తన భర్త ప్రాణాలు కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించిన వైద్య బృందం, తమిళనాడు సీఎం, ఆరోగ్య మంత్రి, ఐఏఎస్ రాధాకృష్ణన్‌కు కూడా ధన్యవాదాలు తెలిపారు.
మీనా, విద్యాసాగర్ వివాహం 2009లో జరిగింది. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే మీనా వివాహం చేసుకుని జీవితంలో స్థిరపడింది. వీరికి ఒక పాప కూడా ఉంది. ఆమె పేరు నైనిక. తమిళంలో దళపతి విజయ్ హీరోగా వచ్చిన తేరీ సినిమాలో నైనిక చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. ఈ సినిమా తెలుగులో పోలీస్ పేరుతో విడుదలైంది. కొన్నాళ్లుగా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ మీనా మళ్లీ సినిమాల్లో నటిస్తోంది. దృశ్యం, దృశ్యం-2 సినిమాల్లో వెంకటేష్ సరసన అద్భుతంగా కనిపించింది. కాగా మీనా భర్త విద్యాసాగర్‌కు ఊపిరితిత్తుల మార్పిడి చేయాల్సి ఉండగా ఎంత ప్రయత్నించినా దాతలు దొరకలేదని ఇటీవల మీనా స్నేహితురాలు, ప్రముఖ కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ తెలిపారు. ప్రస్తుతం తన భర్త చనిపోవడంతో ఇకపై మీనా సినిమాల్లో నటిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. తన కూతురికి నాన్న లేడు అనే ఫీలింగ్ రాకుండా అన్నీ తానే చూసుకోవాలని మీనా భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సినిమాల్లో నటించే విషయంపై మీనా అధికారికంగా స్పందించాల్సి ఉంది.