
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు చాలా రిజర్వుడ్‌గా కనిపిస్తాడు. ఆయన బయటకు రావడం చాలా తక్కువ. అరుదుగా మాత్రమే మహేష్‌బాబు ఇతర హీరోల సినిమాల ఫంక్షన్‌లకు హాజరవుతుంటాడు. కానీ ప్రస్తుతం మహేష్ ఓ సినిమా ప్రమోషన్‌లలో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అయితే ఆ సినిమాకు మహేష్ నిర్మాతగా వ్యవహరించడమే దీనికి కారణం. అడివి శేష్ హీరోగా మేజర్ అనే సినిమా ఈ నెల 3న విడుదల కాబోతోంది. ఈ మూవీ నిర్మాతల్లో మహేష్‌బాబు కూడా ఒకడు. దీంతో నిర్మాతగా మహేష్ ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మహేష్‌కు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మహేష్ సినిమా టిక్కెట్ల కోసం క్యూలో నిలబడతాడు. అయితే ఈ వీడియోలో యూట్యూబ్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ నిహారిక ఎంఎం కూడా కనిపిస్తుంది.
ఈ వీడియోలో తొలుత నిహారిక టికెట్స్ కోసం లైన్‌లో నిలుచుంటే ఆమె కంటే ముందు వచ్చి అడివి శేష్ నిలబడతాడు. దాంతో నిహారిక అడివి శేష్‌తో గొడవపడుతుంటుంది. ఇద్దరూ గొడవ పడుతుంటే.. వారి కంటే ముందు మహేష్ వచ్చి నిలబడతాడు. మహేష్‌ను చూడగానే నిహారిక ఆశ్చరపోతుంది. మా స్నేహితులను కూడా పిలవొచ్చా అని మహేష్ అడిగితే నిహారిక ష్యూర్ అని అంటుంది. దాంతో మరి కొంత మంది ఆ లైన్‌లో వచ్చి చేరుతారు. ఫోన్ నెంబర్ అడిగే లోపు మహేష్ వెళ్లిపోతాడు. దీంతో నిహారిక ఏం చేయకుండా కామ్‌గా ఉండిపోతుంది. మేజర్ సినిమా కోసం ప్రమోషన్స్‌ను నిర్వాహకులు ఇలా డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్‌లను ఆకట్టుకుంటోంది.
సాధారణంగా నిహారిక చేసే ప్రమోషన్ వీడియోలు జనాల మీద రుద్దినట్లు ఉండవు. చాలా సహజత్వంతో నిండి ఉంటాయి. సినిమా కంటెంట్ లోంచి ఐడియాలు తీసుకుంటూనే చాలా క్యూట్‌గా వీడియోలు ప్లాన్ చేయడం నిహారిక స్పెషాలిటీ. ఇన్ స్టాలో మిలియన్ల ఫాలోవర్లు ఉన్న నీహారిక ప్రస్తుతం కాలిఫోర్నియాలోని ఛాప్మన్ యూనివర్సిటీలో ఎంబీఏ చేస్తోంది. తాను ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు చెందిన అమ్మాయిని అంటూ నిహారిక చెప్తోంది. పుట్టింది తమిళనాడులో అయినా పెరిగింది బెంగళూరులో అని.. కానీ తనకు తెలుగు కూడా బాగా వచ్చు అని వివరిస్తోంది. గతంలో కేజీఎఫ్-2 ప్రమోషన్ టైంలో నిహారిక వీడియో ఆకట్టుకోవడంతో ఇప్పుడు సర్కారువారి పాట, మేజర్ సినిమాలకు కూడా ఆమెతో స్పెషల్ ప్రమోషన్ వీడియోలను ప్లాన్ చేశారు. కాగా అడివి శేష్ హీరోగా డైరెక్టర్ శశికిరణ్ తిక్క తెరకెక్కిస్తున్న చిత్రం మేజర్. ముంబయి ఉగ్రదాడుల్లో ప్రాణాలు విడిచిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ సంస్థలతో కలిసి జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేష్ బాబు ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ మూవీని తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.