
ఇటీవల బాలీవుడ్ ప్రముఖ నటుడు, బుల్లితెర ఆర్టిస్ట్ దీపేష్ భాన్ క్రికెట్ ఆడుతూ కుప్పకూలి చనిపోయాడు. అయితే ఆయన వయసు 41 ఏళ్లు మాత్రమే. ఇలా చిన్న వయసులోనే దీపేష్ చనిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతడికి చెడు అలవాట్లు ఉన్నాయనే వాదన కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది. నిజానికి దీపేష్ భాన్‌కు చెడు అలవాట్లు లేవని అతడి సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా దీపేష్ జిమ్ చేసేవాడు అని.. ఆల్కహాల్, పొగాకు వంటి ఉత్పత్తులకు దూరంగా ఉంటాడని చెప్తున్నారు. అయినా దీపేష్ ఎందుకు చనిపోయాడో తమకు కూడా అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యానికి కారణమయ్యే వాటి జోలికి దీపేష్ వెళ్లేవాడు కాదని అందరూ ముక్తకంఠంతో వెల్లడిస్తుండటంతో దీపేష్ మరణానికి గల కారణాలు మరోసారి సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
గతంలోనూ కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ కూడా జిమ్ చేస్తూ మరణించాడని వార్తలు వచ్చాయి. అప్పట్లోనూ అతిగా జిమ్ చేయడం శరీరానికి మంచిది కాదని.. అందుకే అతిగా వ్యాయామం చేయకూడదంటూ మీడియాలో వార్తలు తెగ హల్‌చల్ చేయడం చూశాం. ఇప్పుడు దీపేష్ భాన్ క్రికెట్ ఆడుతూ కిందపడిపోయిన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడం.. మెదడులో రక్తస్రావం జరిగి ప్రాణం కోల్పోవడంతో అసలు ఏం జరిగిందో అర్ధం కాక అతడి కుటుంబ సభ్యులు తలలు పట్టుకుంటున్నారు. అయితే దీపేష్ మరణానికి కారణం ఇటీవల కాలంలో ఫుడ్ సరిగ్గా తినకపోవడమే కారణమని అతడి సహనటుడు ఆసిఫ్ షేక్ వెల్లడించారు. ఇటీవల దిపేష్ కొంచెం బరువు పెరగడంతో డైటింగ్ చేస్తున్నాడని.. దీంతో కొద్దిరోజులగా అతడు రోజుకు రెండు లేదా మూడు గంటల పాటు ఎక్కువగా జిమ్ చేస్తూ సరైన ఆహారం తీసుకోవడం లేదని వివరించారు. రాత్రి భోజనం కూడా మానేశాడని చెప్పారు. ఇవన్నీ అతడి మెదడుపై ప్రభావం చూపి ఉంటాయనే అనుమానాన్ని ఆసిఫ్ షేక్ వ్యక్తం చేశారు.
దీంతో మరోసారి అధిక జిమ్ చేయడం ప్రాణాంతకరమనే వాదన మరోసారి బహిర్గతమైంది. ఇటీవల బెంగుళూరుకు చెందిన ఓ మహిళ బరువులు ఎత్తే క్రమంలో జిమ్‌లో కుప్పకూలి రక్తస్రావానికి గురై మృతి చెందినట్లు వార్త వెలుగు చూసింది. ఈ ఘటన తర్వాత చాలా మంది వైద్యులు జిమ్‌కు వెళ్లి ఎక్కువ వర్కవుట్లు చేయరాదని.. ఎక్కువసేపు బరువులు ఎత్తరాదని హెచ్చరించారు. ఒక వ్యక్తి పని చేసినప్పుడు వారి రక్తపోటు ఎలా పెరుగుతుందో ఎక్కువగా జిమ్ చేసినప్పుడు కొంతమంది మెదడులో రక్తస్రావం జరిగి మరణానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాగా బాలీవుడ్ బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన షోగా ‘భాభి జీ ఘర్ పర్ హై’ని చెప్పుకోవచ్చు. ఈ షోతో పాపులర్ అయిన వారిలో దీపేష్ భాన్ కూడా ఒకరు. ‘భాభి జీ ఘర్ పర్ హై’ అనే బుల్లితెర షోలో మల్ఖాన్ సింగ్ పాత్రతో దీపేష్ భాన్ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ సీరియల్‌తో పాటు కామెడీ కా కింగ్ ఖాన్, కామెడీ క్లబ్, భూత్‌వాలా, ఎఫ్‌ఐఆర్, ఛాంప్ వంటి షోలతోనూ దీపేష్ అభిమానుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.