
జబర్దస్త్ ఫేం కమెడియన్ ఫైమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 6 ద్వారా మంచి పేరు తెచ్చుకున్న కంటెస్టెంట్లలో ఫైమా కూడా ఉంది. 13 వారాలపాటు ప్రేక్షకులను అలరించిన ఫైమా గత ఆదివారం ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. నిజానికి ఫైమా అంతకు ముందు వారమే ఎలిమినేట్ అవ్వాల్సింది. కానీ తన వద్ద ఎవిక్షన్ పాస్ ఉండటం వల్ల అప్పుడు ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంది. దీంతో ఆమెకి మరో వారం బిగ్ బాస్ ఇంట్లో ఉండే అవకాశం వచ్చింది. కానీ ఈ వారం మాత్రం ఎలిమినేషన్ నుంచి తప్పించుకోలేకపోయింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఫైమా కామెడీ, వెటకారాలు ప్రేక్షకులను అలరించాయి. అయితే వెటకారం హద్దు దాటడంతో ఆడియన్స్ ఆమెకు ఓట్లు వేయలేదు. దీంతో ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. కానీ టాస్కుల్లో ఫైమా ఫిజికల్‌గా పోటా పోటీగా తలపడేది. రేవంత్‌తో నువ్వా నేనా అనే స్థాయిలో ఆమె పోరాటం ఉండేది.
బిగ్‌బాస్ నుంచి అనూహ్య స్థాయిలో ఎలిమినేట్ అయిన తర్వాత నాగార్జునతో ఫైమా చేసిన అల్లరి ముచ్చటగా కనిపించింది. ముఖ్యంగా నాగార్జున ఫైమా చేతిపై ముద్దు పెట్టుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఫైమాకు మాటీవీ యాజమాన్యం అదిరిపోయే ఆఫర్ ఇచ్చిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ మేరకు ఆమెతో కొత్త అగ్రిమెంట్ చేయించుకున్నట్లు ప్రచారం సాగుతోంది. మల్టీటాలెంటెడ్ ఫైమాతో ఓ గేమ్ ఫో ప్రారంభించాలనే ఆలోచనలో మాటీవీ ఉందని.. సదరు షోలో పంచ్ కామెడీ డైలాగులు, వెటకారం ఉంటుందని.. దీనికి ఫైమా అయితే కరెక్టుగా సూటవుతుందని మాటీవీ నిర్వాహకులు భావించినట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే బిగ్‌బాస్‌తో ఫైమా జాతకం మారిపోయింది. ఇప్పుడు ఈ షోతో ఆమెకు మరింత పాపులారిటీ ఖాయమనే అంచనాలకు అభిమానులు వచ్చేశారు.
అటే 13 వారాల పాటు బిగ్ బాస్ ఇంట్లో ఉన్న ఫైమా ఒక వారానికి 25 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఆమె బిగ్ బాస్ జర్నీ ద్వారా మూడు లక్షల 25 వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పటాస్ షో ద్వారా పాపులర్ అయిన ఫైమా జబర్దస్త్ షో ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పరచుకుంది. ఒకవైపు ఫాన్ ఫాలోయింగ్‌తో పాటు మరోవైపు రెమ్యూనరేషన్ కూడా ఫైమా బాగానే అందుకుంది. బిగ్‌బాస్ షో ద్వారా తనకు కాస్త వెటకారం ఎక్కువ అనే ముద్రపడిపోయిందని ఫైమా ఆవేదన వ్యక్తం చేసింది. కానీ నిజానికి తాను బయట ఎలా ఉంటానో .. లోపల కూడా అలాగే ఉన్నానని వివరించింది. తాను ఎంతమాత్రం మారలేదని.. తాను మారితే ఫైమాను ఎలా అవుతానని ప్రశ్నించింది. ఇనయా మొదట్లో తనతో బాగానే ఉందని.. కానీ ఓ వివాదం కారణంగా ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని ఫైమా చెప్పుకొచ్చింది. శ్రీహాన్ కూడా వెటకారం చేసేవాడు అని.. తనను హౌస్‌లో ప్రోత్సహించిన వారిలో గీతూ, ఆదిరెడ్డి ఉన్నారని తెలిపింది.