
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2న పవన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ జల్సాను రీ రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణ వంటి తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, ఓవర్సీస్లోనూ జల్సా సినిమాను రిలీజ్ చేశారు. 14 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాను 4కే ప్రొజెక్షన్, డాల్బీ ఎట్మాస్ సౌండ్ క్వాలిటీ వంటి టెక్నాలజీతో మరోసారి విడుదల చేయడంతో పవర్ స్టార్ అభిమానులు ఈ సినిమాను చూసేందుకు ఎగబడ్డారు. దీంతో ఈ వారం టాలీవుడ్లో రిలీజైన సినిమాలకు భారీదెబ్బ పడింది. ముఖ్యంగా మావయ్య జల్సా సినిమాతో మేనల్లుడు రంగ రంగ వైభవంగా సినిమా బలైనట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. జల్సా సినిమా ప్రత్యేక షోలను భారీగా ప్లాన్ చేయడంతో మెగా అభిమానులు పంజా వైష్ణవ్ తేజ్ నటించిన సినిమాను పట్టించుకోలేదు.
వైష్ణవ్ తేజ్‌కు ఉప్పెన సినిమా తర్వాత మరో హిట్ పడలేదు. దీంతో అతడు విజయం కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో రంగ రంగ వైభవంగా సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నాడు. అయితే రివ్యూలు కూడా ఈ సినిమాకు పాజిటివ్‌గా రాకపోవడంతో మెగా అభిమానులతో పాటు న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపించలేదు. ఈ మూవీతో పాటు విక్రమ్ నటించిన కోబ్రా, జాతిరత్నాలు ఫేం దర్శకుడు అనుదీప్ కథ అందించిన ఫస్ట్ డే ఫస్ట్ షో, బుజ్జి ఇలా రా, ఆకాశ వీధుల్లో, డై హార్డ్ ఫ్యాన్ వంటి మూవీస్ టాలీవుడ్లో విడుదలయ్యాయి. ఈ సినిమాలన్నీ జల్సా దెబ్బతో భారీగా చతికిలపడ్డాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా జల్సా. 2008 ఏప్రిల్ 2న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులు అన్ని బద్దలయ్యాయి. అయితే ఇప్పుడు రీ రిలీజ్లోనూ ఈ సినిమా రికార్డులను సొంతం చేసుకోవడం విశేషంగానే ట్రేడ్ విశ్లేషకులు పరిగణిస్తున్నారు.
ముఖ్యంగా గతంలో జల్సా సినిమా విడుదలైన సమయంలో ఎలాంటి సందడి నెలకొందో.. మళ్లీ రీ రిలీజ్ చేసిన సమయంలోనూ అదే సందడి నెలకొంది. ఏకంగా 700కి పైగా షోలతో జల్సా మూవీ ట్రెండ్ సెట్ చేసింది. జల్సాతో పాటు పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాను కూడా రీ రిలీజ్ చేసినా తక్కువ షోలు మాత్రమే ప్రదర్శించారు. జల్సా సినిమానే ఎక్కువ స్క్రీన్లలో విడుదల చేయడంతో ఈ మూవీ కొత్త సినిమాల మాదిరిగా భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. జల్సా మూవీ స్పెషల్ షోస్‌కు దాదాపు రూ.2.85కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఒక రీ రిలీజ్ మూవీకి ఈ స్థాయిలో వసూళ్లు వచ్చాయంటే విశేషం అనే చెప్పాలి. త్రివిక్రమ్ టేకింగ్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, పవన్ పర్ఫార్మెన్స్ సినిమాను బిగ్గెస్ట్ హిట్‌గా చేశాయి. అప్పట్లో వెయ్యి స్క్రీన్లలో విడుదలైన మొదటి సినిమాగా జల్సా రికార్డు సృష్టించగా ప్రస్తుతం రీ రిలీజ్లోనూ అత్యధిక షోలు ప్రదర్శింపబడిన మూవీగా నిలిచింది. త్వరలో ప్రభాస్ బర్త్ డే కానుకగా బిల్లా సినిమా కూడా రీ రిలీజ్ కానుంది.