
ప్రస్తుతం టాలీవుడ్‌లో పాత సినిమాలు మళ్లీ సందడి చేస్తున్నాయి. ఇటీవల సూపర్‌స్టార్ మహేష్‌బాబు బర్త్ డే కానుకగా అతడు, పోకిరి సినిమాలను రీ రిలీజ్ చేయగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఘరానా మొగుడు సినిమాను మరోసారి విడుదల చేశారు. తాజాగా సెప్టెంబర్ 2న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డేను పురస్కరించుకుని ఒకరోజు ముందుగా తమ్ముడు, జల్సా సినిమాలను రీ రిలీజ్ చేశారు. వీటిలో జల్సా సినిమాను 4కే, డాల్బీ ఎట్మాస్ క్వాలిటీలోకి మార్చి భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీకి కొత్త రిలీజ్ మూవీకి చేసినంత హడావిడిని పవర్‌స్టార్ అభిమానులు చేశారంటే అతిశయోక్తి కాదు. ఎంత భారీగా విడుదల చేసినా ఓటీటీలు, టీవీల్లో ప్రసారమైన సినిమాను మరోసారి చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపారంటే దానికి పవర్‌స్టార్ క్రేజ్ మాత్రమే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2008లో విడుదలై సంచలన విజయం సాధించింది.
తాజాగా ఇటీవల మహేష్ బాబు పోకిరి సినిమా నెలకొల్పిన రికార్డును కూడా పవన్ కళ్యాణ్ జల్సా బ్రేక్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పోకిరి సినిమా రీ రిలీజ్‌లో రూ. 1.5 కోట్ల కలెక్షన్స్ అందుకోగా జల్సా సినిమా అంతకంటే ఎక్కువగా రూ.2.85 కోట్ల వసూళ్లను అందుకొని రీ రిలీజ్ కేటగిరీలోనే ఆల్ టైం రికార్డ్ ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పెద్ద హీరో సినిమా ఏ స్థాయిలో విడుదల అవుతుందో ఆ స్థాయిలో జల్సా రీ రిలీజ్ అయ్యింది. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో జల్సా రూ.35 లక్షలు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అటు తమ్ముడు సినిమా కూడా రూ.12 లక్షలు వసూలు చేసింది. పోకిరి హైదరాబాద్ సిటీ మొత్తం రూ.47 లక్షలు వసూలు చేయగా జల్సా మూవీ కేవలం ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోనే రూ.35 లక్షలు వసూలు చేయడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా జల్సా మూవీని 700కి పైగా ప్రత్యేక షోలు ప్రదర్శించినట్లు తెలుస్తోంది. పోకిరి సినిమా నైజాం ప్రాంతంలో మొత్తం మీద 69 లక్షలు వసూలు చేస్తే జల్సా సినిమా ఒక్కటే సుమారు కోటి పాతిక లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం అందుతోంది.
మరోవైపు మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ స్వయంగా హైదరాబాద్ నగరంలోని సంధ్య ధియేటర్‌కు వెళ్లి సాధారణ ప్రేక్షకుడిగా జల్సా సినిమాను వీక్షించి ఎంజాయ్ చేశాడు. తెరపైకి కాగితాలు విసురుతూ సినిమాను సాధారణ అభిమానిగా తేజ్ ఎంజాయ్ చేస్తున్న వీడియో మెగా ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది. ఇక ఆయన వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. సాధారణంగా కేవలం ఏదైనా పండుగల సందర్భంగా లేదా శివరాత్రి లాంటి పర్వదినాల నేపథ్యంలోనే సినిమాలు రీ రిలీజ్ చేస్తూ ఉండేవారు. కానీ ఈ ఏడాది తొలిసారిగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పోకిరి, ఒక్కడు లాంటి సినిమాలను పలుచోట్ల రీ రిలీజ్ చేశారు. దీంతో ఈ ట్రెండు ఊపు అందుకుంది. త్వరలో ప్రభాస్ పుట్టినరోజు కానుకగా బిల్లా సినిమాను, ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా సింహాద్రి సినిమా స్పెషల్ షోలను ప్రదర్శించాలని అభిమానులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.