
జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన కమెడియన్‌లలో బుల్లెట్ భాస్కర్ కూడా ఒకడు. అతడు చేసే స్కిట్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాయి. అయితే చాలా మందికి బుల్లెట్ భాస్కర్ వ్యక్తిగత జీవితం గురించి తెలియదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి చెప్తూ బుల్లెట్ భాస్కర్ ఎమోషనల్ అయ్యాడు. పైకి నవ్వుతూ కనిపించే తన జీవితంలో విషాద గాధలు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా అతడు ఓపెన్ అయ్యాడు. తాను రెండేళ్లుగా ఓ అమ్మాయిని సిన్సియర్‌గా లవ్ చేసినట్లు వెల్లడించాడు. ఆ అమ్మాయితో తాను కొంతకాలం కలిసున్నానని అయితే ఆ అమ్మాయి తనను వదిలేసి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ప్రేమించిన అమ్మాయి తనను వదిలి వెళ్లిపోవడంతో తనకు పిచ్చెక్కిందని.. ఎక్కడెక్కడో తిరిగానని తెలిపాడు. చివరకు ఆత్మహత్య కూడా చేసుకోవాలని భావించానని.. ఆ ప్రయత్నంలో తనకు ఎన్నో దెబ్బలు కూడా తగిలాయని బుల్లెట్ భాస్కర్ చెప్పుకొచ్చాడు.
తాను ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యాక జీవితంలో ఎదగాలని నిర్ణయించుకున్నానని.. అప్పుడే తాను హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడినట్లు బుల్లెట్ భాస్కర్ వెల్లడించాడు. తనను వద్దని వెళ్లిపోయిన వాళ్లే తనను చూసి అసూయ పడేలా కెరీర్‌లో ఎదగాలని అప్పుడే నిర్ణయించుకున్నట్లు వివరించాడు. తాను ఎదిగి చూపిస్తేనే తనను మోసం చేసిన వాళ్లను చెప్పుతో కొట్టినట్లు ఉంటుందని భావించినట్లు తెలిపాడు. జబర్దస్త్ షోలో అవకాశం రావడం నిజంగా తన అదృష్టమని బుల్లెట్ భాస్కర్ చెప్పుకొచ్చాడు. బుల్లెట్ భాస్కర్‌కు కామెడీ స్కిట్లు వేయడంతో పాటు మిమిక్రీ చేయడం అంటే కూడా ఎంతో ఇష్టం. జబర్దస్త్ షోలోకి రాకముందు అతడు పలు టీవీ ఛానళ్లలో మిమిక్రీ చేసేవాడు. మహేష్‌బాబు వాయిస్‌ను బుల్లెట్ భాస్కర్ భలే మిమిక్రీ చేస్తాడు. 2014లో విడుదలైన మహేష్‌బాబు నేనొక్కడినే సినిమా మొత్తానికి తానే డబ్బింగ్ చెప్పినట్లు జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్ గతంలో ఓ సందర్భంలో తెలియజేశాడు.
మహేష్‌బాబు వాయిస్‌తో పాటు కళ్లు చిదంబరం, కొండవలస లక్ష్మణరావు వంటి నటుల వాయిస్‌ను కూడా బుల్లెట్ భాస్కర్ ఇమిటేట్ చేస్తాడు. కేవలం సినిమా నటుల వాయిస్‌లనే కాదు పొలిటికల్ లీడర్ల వాయిస్‌ను కూడా బుల్లెట్ భాస్కర్ మిమిక్రీ చేసి అలరిస్తాడు. అయితే బుల్లెట్ భాస్కర్‌పై పలు విమర్శలు కూడా ఇటీవల కాలంలో వినిపించాయి. ముఖ్యంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చిన అప్పారావు ఇటీవల బుల్లెట్ భాస్కర్‌పై పలు ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తాను కావాలని జబర్దస్త్ షో కి దూరం కాలేదని జబర్దస్త్ షో వాళ్లు కావాలని దూరం చేశారని బుల్లెట్ భాస్కర్‌ను ఉద్దేశిస్తూ అప్పారావు ఆరోపించాడు. బుల్లెట్ భాస్కర్ ఏపీలోని విశాఖపట్నం ప్రాంతానికి చెందినవాడు. 1978 ఆగస్టు 13న జన్మించాడు. ప్రస్తుతం బుల్లెట్ భాస్కర్ వయసు 43 సంవత్సరాలు. బుల్లెట్ భాస్కర్ తండ్రి డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఇటీవల ఆయన్ను ఫాదర్స్ డే సందర్భంగా జబర్దస్త్ కార్యక్రమంలోకి తన తండ్రిని బుల్లెట్ భాస్కర్ ప్రేక్షకులకు పరిచయం చేశాడు.