
టాలీవుడ్‌లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ కమెడియన్ అలీ మధ్య బంధం గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. వీళ్లిద్దరూ ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. తొలిప్రేమ, బద్రి, ఖుషి, అన్నవరం, అత్తారింటికి దారేది లాంటి సినిమాల్లో పవన్, అలీ హిట్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్నారు. వీళ్లిద్దరి మధ్య సినిమాల్లోనే కాకుండా వ్యక్తిగతంగానూ మంచి బాండింగ్ ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టడంతో అలీ కూడా ఆ పార్టీలోనే చేరతారనే వార్తలు వినిపించాయి. కానీ అలీ మాత్రం వైఎస్ఆర్ తనయుడు జగన్ స్థాపించిన వైఎస్ఆర్‌సీపీలో చేరారు. ఆ పార్టీలో రాజ్యసభ ఎంపీ పదవిని ఆశించారు. ఒకవేళ రాజ్యసభ పదవిని ఇవ్వకపోయినా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పదవిని అయినా ఇస్తారని పలువురు భావించారు. కానీ జగన్ ఎలాంటి పదవిని అలీకి కట్టబెట్టకపోవడంతో అలీ అలకబూనారనే ప్రచారం సాగుతోంది.
అటు పవన్ కల్యాణ్ ఓ వైపు స్టార్ హీరోగా ఉంటూనే..ఇంకోవైపు జనసేన అధినేతగా వచ్చే 2024 ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అలీ జనసేన వైపు చూస్తున్నారని ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. వైసీపీలో జరుగుతున్న పరిణామాలపై అలీ అసంతృప్తిగా ఉన్నారని.. ఆయన జనసేనలో చేరితే తూర్పు గోదావరి లేదా పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చే ఎన్నికల్లో నేరుగా పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజమండ్రి నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో అలీ ఆ స్థానం నుంచే టికెట్ ఆశించే అవకాశం ఎక్కువున్నట్టు పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీలో తన పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే.. వచ్చే ఎన్నికల నాటికి తనను పట్టించుకునే పరిస్థితి ఉండదని అలీ భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అందుకే తనకు విలువలేని చోటు కంటే విలువ ఇచ్చే పార్టీలోకి వెళ్లడం బెటరని అలీ డిసైడ్ అయ్యారని టాక్ నడుస్తోంది.
తనకు అలీ అంటే ఎంతో గౌరవమని, ప్రతీ సినిమాలో అలీ ఉండేలా చూసుకుంటానని గతంలో ఓ ఈవెంట్ సందర్భంలో పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. ఈ ఇద్దరూ ఇండస్ట్రీ పరంగా, వ్యక్తిగతంగా మంచి ఫ్రెండ్ షిప్ కొనసాగిస్తున్నా.. పొలిటికల్‌గా వచ్చేసరికి రెండు భిన్న నేపథ్యం ఉన్న పార్టీల్లో కొనసాగుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతానికి జనసేన పార్టీలో చేరడానికి జనసేన పెద్దలతో అలీ సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. నిప్పు లేనిదే పొగ రాదనే సామెత ఉన్నట్లు అలీ ఇలాంటి చర్చలు చేపట్టకపోతే ఆయన జనసేనలో చేరతారనే వార్తలు మీడియాలో వచ్చేవి కావు. అయితే ఆలస్యంగా అయినా అలీ తనకు ఎంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్ పార్టీలో చేరతారనే వార్తలు వస్తుండటంతో పవర్ స్టార్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు జనసేన పార్టీకి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని స్థానాలు గెలిచే అవకాశాలున్న నేపథ్యంలో అలీ ఈ జిల్లాలలో ఏదో ఒక స్థానం నుంచి నిలబడితే ఎమ్మెల్యే కావాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకునే అవకాశం దక్కుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.