
టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తున్న హీరోయిన్ పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో ఒక్కసారిగా అందరి కళ్లను ఆమె తన వైపుకు తిప్పుకుంది. ఈ సినిమాలో సీత పాత్రలో మృణాల్ అదరగొట్టేసింది. ఈ మూవీని మళ్లీ మళ్లీ చూసేలా చేసింది. ఇప్పుడు ఆమెను మృణాల్ అని పిలవడానికి బదులు సీతారామం హీరోయిన్ అని అందరూ పిలుస్తున్నారు. ఈ సినిమాలో సీతా పాత్రకు మృణాల్ తప్ప మరెవరూ న్యాయం చేయలేరని కామెంట్స్ చేస్తూ మెచ్చుకుంటున్నారు. ఈ మూవీలో అచ్చ తెలుగు అమ్మాయిగా నటించి మార్కులు కొట్టేసింది. సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. అయితే మృణాల్ సినిమాల్లోకి రాకముందు ఎన్నో కష్టాలను చవిచూసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో పుట్టి పెరిగిన ఈ భామ చదువు పూర్తయిన తర్వాత మీడియా వైపు వెళ్లాలని ప్రయత్నించింది. అయితే అమ్మ, నాన్న ఒప్పుకోకపోవడంతో ఆమెకు అవమానాలు ఎదురయ్యాయి.
మృణాల్ తండ్రి బ్యాంక్ ఉద్యోగిగా పనిచేసేవాడు. తండ్రి మాత్రమే కాకుండా మృణాల్ ఫ్యామిలీలో చాలా వరకు ఉద్యోగులే ఉన్నారు. వారికి మీడియా అంటే తెలియదు. ఎవరికి చెప్పినా అదో బ్యాచ్‌లర్ ఆఫ్ మాస్ మీడియా అనే కోర్స్ ఉందా అంటూ చులకనగా మాట్లాడేవారట. అవమానంగా చూసేవారు. అది తనతో పాటు తన తల్లిదండ్రులకు చాలా ఇబ్బందిగా అనిపించేదని మృణాల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ తర్వాత తన నాన్నకి జాబ్ బదిలీ కావడంతో ముంబయిలోనే ఒంటరిగా ఉండేదానిని అంటూ వివరించింది. కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని కూడా చెప్పింది. ఒకరోజు కాలేజీకి వెళ్తున్న సమయంలో రైలులో డోర్ దగ్గర నిలబడి బయటకు దూకేయాలని అనుకున్నానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఫ్రెండ్స్ సలహాలను అనుసరించి సినిమాల్లోకి వచ్చినట్లు తెలిపింది. ఆ తర్వాత మోడలింగ్ వైపు అడుగులు వేశానని..సీరియళ్లు చేసుకునే తాను సినిమా హీరోయిన్‌గా పనికిరానని కొంతమంది అవమానించారని కన్నీటిపర్యంతమైంది.
అటు సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమాలో ఛాన్స్ వచ్చినట్టే వచ్చిందని.. కానీ తనకు దక్కకుండా పోయిందని మృణాల్ చెప్పింది. లవ్ సోనియా అనే సినిమాలో వేశ్యా గృహంలో ఉన్న చెల్లిని కాపాడుకునే అక్క పాత్రలో తాను నటించానని వేశ్యా గృహంలో ఉండే వాళ్ల అనుభవాలు తెలుసుకోవడానికి రెండు వారాల పాటు వేశ్యాగృహంలో ఉన్నానని వివరించింది. వేశ్యాగృహంలో ఉన్నవాళ్ల కథలు విని తట్టుకోలేకపోయానని గుర్తుచేసుకుంది. అటు సీతా రామం సినిమాలో సీత పాత్రలో అందంగా కనిపించిన మృణాల్ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది.ఈ ఫోటోలను చూసిన సీతా రామం సినిమా అభిమానులు, నెటిజన్స్ విమర్శిస్తున్నారు. మరోవైపు టాలీవుడ్ నుంచి మృణాల్ ఠాకూర్‌కు భారీగానే ఆఫర్లు వస్తున్నాయి. సీతా రామం సక్సెస్ తర్వాత మృణాల్ ఠాకూర్ రెమ్యునరేషన్ కూడా పెంచేసినట్లు టాక్ నడుస్తోంది. త్వరలోనే అగ్రహీరోల సినిమాల్లో మృణాల్ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.