
మెగాస్టార్ చిరంజీవి అభిమానులను అలరించడానికి సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్యగా రాబోతున్నాడు. ఈ మూవీ జనవరి 13న భారీస్థాయిలో విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్‌లలో భాగంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు షాకింగ్‌గా మారాయి. ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్ బ్యానరుపై యర్నేని నవీన్, రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే ఇదే బ్యానర్ బాలయ్య హీరోగా వీరసింహారెడ్డి మూవీని కూడా నిర్మించింది. ఈ సినిమా కూడా సంక్రాంతి కానుకగా విడుదలవుతోంది. ఒక్క రోజు తేడాలో ఒకే బ్యానర్ నుంచి రెండు పెద్ద సినిమాలు విడుదల కావడం టాలీవుడ్ చరిత్రలోనే ఇదే తొలిసారి. దీంతో నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. రెండు పెద్ద సినిమాలకు థియేటర్లను ఎడ్జస్ట్ చేయలేక సతమతం అవుతున్నారు. దీంతో నిర్మాతల ఇబ్బందులను గమనించి తాను వాల్తేరు వీరయ్యను ఫిబ్రవరికి వాయిదా వేయాలని చెప్పినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు.
కానీ అటు మెగా, ఇటు నందమూరి అభిమానులను సంతృప్తి పరచడమే తమ ఉద్దేశమని చిరుకు నిర్మాతలు స్పష్టం చేసినట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. తమకు ఇద్దరు అభిమానులు రెండు కళ్ల లాంటి వారు అని.. వారిలో ఎవ్వరినీ తాము బాధ పెట్టేది లేదని చెప్పారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో నిర్మాతలు ధైర్యం చేసి ఒకేసారి రెండు సినిమాలను విడుదల చేస్తున్నారు. ఇది రిస్క్ అయినా నిర్మాతలకు రెండు సినిమాలపై ఎంతో కాన్ఫిడెంట్ ఉందని చిరంజీవి చెప్పాడు. అటు ప్రాణం ఖరీదు సినిమా విడుదల సమయంలో తాను ఎంత టెన్షన్ పడ్డానో ఇప్పటికీ అదే టెన్షన్ పడుతున్నానని.. కానీ అది రేసుగుర్రంలో శ్రుతిహాసన్ టైపులో బయటపెట్టలేకపోతున్నానని చిరు చెప్పాడు. తాను రాజకీయాల నుంచి కమ్ బ్యాక్ ఇచ్చిన తర్వాత తన నుంచి అభిమానులు కోరుకునే అంశాలతో సినిమా చేయలేకపోయానని.. ఖైదీ నంబర్ 150, సైరా, గాడ్ ఫాదర్ లాంటి సినిమాల్లో ఏదో ఒక సందేశం ఇవ్వడం జరిగిందని.. కానీ వాల్తేరు వీరయ్య సినిమాలో అభిమానులకు నచ్చే అన్నీ అంశాలు ఉంటాయని చిరు అన్నాడు.
కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వం వహిస్తున్న వాల్తేరు వీరయ్య మూవీలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్‌గా కనిపించబోతున్నాడు. బాబీ తన అభిమాని అని ఈ మూవీ కథ ఓకే చేయలేదని, ఒకసారి స్టోరీ లైన్ విని ఒప్పుకున్న తరువాత అతడు ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయడం కోసం పడ్డ శ్రమ అంతా ఇంతా కాదని చిరంజీవి చెప్పుకొచ్చాడె, ఏదైనా స్టోరీ విన్నపుడు అందులోని ఎమోషన్‌ను తాను చూస్తానని, మంచి ఎమోషనల్ అంశాలు ఉంటేనే అది ఆడియన్స్‌కు, అభిమానులకు బాగా రీచ్ అవుతుందని, తన గత బ్లాక్ బస్టర్ సినిమాలు అన్ని కూడా అటువంటి అంశాలతో తెరకెక్కినవే అని చిరు వివరించాడు. ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చాడు. గతంలో చిరు-దేవి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్, అందరి వాడు, ఖైదీ నంబర్ 150 మూవీస్‌లో పాటలు శ్రోతలను అలరించాయి. తాజాగా వాల్తేరు వీరయ్యలో బాస్ సాంగ్, పూనకాలు లోడింగ్ సాంగ్స్ కూడా అభిమానులను అలరిస్తున్నాయి. ఈ మూవీ రవితేజ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు.