
చిత్రసీమలో అవకాశాలు రావాలంటే మాములు విషయం కాదు. కానీ టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి అంటే స్వయంకృషితో పైకొచ్చిన నటుడు అని అందరూ ఉదాహరణగా చెప్తుంటారు. కానీ చిరంజీవికి వచ్చిన స్టార్ డమ్ వెనుక అతడి బావ అల్లు అరవింద్ ఉన్నాడని చాలా మంది భావిస్తుంటారు. అల్లు రామలింగయ్య కుమార్తెను పెళ్లి చేసుకున్న తర్వాతే చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగాడని అభిప్రాయపడుతుంటారు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో నటుడు చంద్రమోహన్ చెప్పారు. చిరంజీవి సక్సెస్‌కు అల్లు అరవింద్ కారణమని.. అరవింద్ కృష్ణుడు అయితే చిరంజీవి అర్జునుడు అని చంద్రమోహన్ అన్నారు. అయితే చంద్రమోహన్ వ్యాఖ్యలను సీనియర్ సినిమా జర్నలిస్ట్ ఇమంది రామారావు ఖండించారు. నిజానికి చిరంజీవి లేకపోతే అల్లు అరవింద్ ఎక్కడ ఉండేవాడని ఆయన ప్రశ్నించారు. బంగారం గొప్పదా లేదా బంగారం తయారు చేసే వ్యక్తి గొప్పవాడా అనే ప్రశ్నకు బంగారం గొప్పదనే సమాధానం వినిపిస్తుందని ఇమంది రామారావు వివరించారు.
అల్లు కుటుంబంలోకి చిరంజీవి వచ్చే సమయానికే ఆయన మెగాస్టార్ అని ఇమంది రామారావు గుర్తుచేశారు. డ్యాన్స్‌లకు చిరంజీవి పెట్టింది పేరు అని.. చిరంజీవి తన బ్యానర్‌లో నటించడం వల్లే అల్లు అరవింద్‌కు పేరు వచ్చిందని ఇమంది రామారావు అన్నారు. చిరంజీవి ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడని ప్రశంసలు కురిపించారు. మరోవైపు నీలిచిత్రాల కేసులో కెరీర్ పీక్ టైంలో ఉన్న సమయంలో సుమన్ జైలుకు వెళ్లడం వల్ల చిరంజీవి పెద్ద హీరో అయ్యాడన్న కామెంట్లను కూడా ఇమంది రామారావు తప్పుబట్టారు. సుమన్‌ను చిరంజీవి తొక్కేశాడన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. అలా జరిగి ఉంటే.. నేను అలా ఉండేవాడిని అన్న మాటలు కేవలం ఊహించుకోవడానికే బాగుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీలో ఎవరూ ఎవరిని తొక్కేయడానికి వీలుండదని.. టాలెంట్ ఉండి ఎంత కష్టపడితే అంత పేరు వస్తుందని చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారని కొనియాడారు. సినిమా ఇండస్ట్రీలో ఒక కులం హీరోలే సక్సెస్ అయ్యారని చెప్పడం కరెక్ట్ కాదని కూడా స్పష్టం చేశారు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ ఏడాది మెగాస్టార్ నటించిన ఆచార్య సినిమా విడుదల కాగా వచ్చే ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య మూవీ విడుదల కాబోతోంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ మూవీ పూర్తి మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన బాస్ పార్టీ సాంగ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ మూవీలో మాస్ మహరాజా రవితేజ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో రవితేజ లుక్ ఎలా ఉంటుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 11.07 గంటలకు వాల్తేరు వీరయ్య చిత్రం నుంచి రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల అవుతుందని ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్, కేథరిన్ థెరిసా హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. మైత్రీమూవీ మేకర్స్ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమా తర్వాత భోళా శంకర్ మూవీతో చిరు అలరించనున్నాడు.