
దర్శకుడు వైవీఎస్ చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీతారాముల కళ్యాణం చూతము రారండి సినిమా ద్వారా వైవీఎస్ చౌదరి తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. గ్రేట్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అక్కినేని నాగార్జున ఈ మూవీని నిర్మించాడు. ఈ మూవీ ఘనవిజయం సాధించడంతో నాగార్జున వైవీఎస్ చౌదరికి వెంటనే తన సినిమాను ఆఫర్ చేశాడు. ఆ సినిమా పేరే సీతారామరాజు. అయితే ఈ మూవీ కథను వైవీఎస్ చౌదరి చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో తెరకెక్కించాలని భావించాడట. కానీ డేట్లు సర్దుబాటు కాకపోవడం వాళ్లకు ఈ సినిమా చేయడానికి కుదరలేదట. తర్వాత ఇదే కథను నాగార్జునకు, హరికృష్ణకు చెప్పడంతో వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంతేకాకుండా నాగ్ ఈ సినిమాను తన సొంత సంస్థలోనే నిర్మించాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ సీతారామరాజు సినిమాను చిరు, పవన్ కాంబోలో తెరకెక్కిస్తే ఇంకా బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ఈ మూవీలో సాక్షిశివానంద్, సంఘవి హీరోయిన్‌లుగా నటించారు. చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య అనుబంధం గురించి తెలుసుకుని ఆ ఇద్దరు మహానటుల వారసులు హరికృష్ణ, నాగార్జునతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు వైవీఎస్ చౌదరి వివరించారు. 1999లో ఫిబ్రవరి 5న విడుదలైన ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించడంతో ఆయన క్రేజీ దర్శకుడిగా మారిపోయారు. ఈ సినిమాను నాగార్జున, డి.శివప్రసాద్ రెడ్డి కలిసి గ్రేట్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మించారు. నటుడు పోసాని కృష్ణ మురళి సంభాషణలు అందించాడు. ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశాడు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య అనుబంధం, వారిద్దరికీ ఒక చెల్లి. ఆమె గురించి వారిమధ్య భేదాభిప్రాయాలు లాంటి అంశాల చుట్టూ సీతారామరాజు కథ ఉంటుంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్ని కథలొచ్చినా సీతయ్య, రామరాజు కథ ప్రత్యేకంగా నిలుస్తుంది. నాగ్ లాంటి తమ్ముడు ఉండాలని ప్రతి అన్నయ్య, హరికృష్ణ లాంటి అన్నయ్య ఉంటే బావుంటుందని ప్రతి తమ్ముడు అనుకున్నారంటే అతిశయోక్తి కాదేమో. అంతలా అన్నదమ్ముల మధ్య బంధాన్ని హృదయానికి హత్తుకునేలా చేశారు. ఈ సినిమా కథ, కథనం ఒక ఎత్తైతే.. కీరవాణి అందించిన సంగీతం, నేపథ్య సంగీతం మరో ఎత్తు. ప్రతి సన్నివేశంలోనూ తన స్వరాలతో మదిని మీటారాయన. ముఖ్యంగా చాంగురే చాంగురే, ఏవండోయ్ శ్రీవారు లాంటి పాటలు ప్రతి ఒక్కరితోనూ పాడించాయి. ఇన్నేళ్లవుతున్నా ఏదో ఓ చోట మారుమోగుతూనే ఉంటాయి. సంఘవి, సాక్షి శివానంద్ అందం, అభినయం అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్నాయి. ఈ మూవీ చివరిలో హరికృష్ణ చనిపోవడం రాయిని సైతం కరిగిస్తుంది. అంతగా ఆయన సీతయ్య పాత్రలో జీవించేశారు. ఒకవేళ సీతారామరాజు మూవీని చిరు, పవన్ చేసి ఉంటే తెలుగు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేదని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.