
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో గ్యాంగ్ లీడర్ సినిమాకు ప్రత్యేకస్థానం ఉంటుంది. అప్పటికే నెంబర్ వన్ హీరోగా, మెగాస్టార్‌గా చిరంజీవి ఎదిగినా గ్యాంగ్ లీడర్ సినిమా సాధించిన సంచలన విజయం చిరంజీవిని తిరుగులేని స్థానంలో నిలబెట్టింది. అంతకుముందు చిరంజీవి సినిమాల్లో 1990లో వచ్చిన రాజా విక్రమార్క, 1991లో వచ్చిన స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో అందరి దృష్టి గ్యాంగ్ లీడర్‌పై పడింది. విజయ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి సరసన విజయశాంతి ఈ మూవీలో నటించింది. మాస్, ఫ్యామిలీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాలో చిరంజీవి బాడీ లాంగ్వేజ్, మాస్ మేనరిజమ్స్, స్టయిల్, డైలాగ్ డిక్షన్.. అభిమానులకు కిక్కెక్కించాయి. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ను రప్ఫాడించింది. టిక్కెట్ రేట్లు రూ.15, రూ.10 ఉండే ఆ రోజుల్లోనే ఈ సినిమా రూ.9 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ వర్గాలను నోరెళ్లబెట్టించింది.
నిజానికి దర్శకుడు విజయ బాపినీడు తీయాలనుకున్న సినిమా గ్యాంగ్ లీడర్ కాదు. ఒకప్పుడు తాను తీసిన మనసుకు బాగా నచ్చిన బ్లాక్ అండ్ వైట్ ఫ్యామిలీ డ్రామా 1978లో వచ్చిన బొమ్మరిల్లు సినిమా ఆధారంగా నాగబాబుతో ఓ సినిమా తీయాలనుకున్నారు. షోలేలోని గబ్బర్ సింగ్ పాత్రధారి అమ్జాద్ ఖాన్ డైలాగ్ ప్రేరణతో ‘అరె ఓ సాంబా’ అని టైటిల్ పెట్టాలనుకున్నారు. తీరా చిరంజీవి ఓ సినిమా చేద్దామని పిలిచేసరికి ఆ సినిమాను పక్కనపెట్టి ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. నాగబాబుతో తీయాలనుకున్న సినిమా కథకే యాక్షన్ జోడించి గ్యాంగ్ లీడర్‌గా తెరకెక్కించారు. అప్పట్లో మ్యూజిక్ దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తండ్రి సత్యమూర్తి ఓ పత్రిక కోసం గ్యాంగ్ లీడర్ అనే ఓ సీరియల్ రాస్తున్నారు. ఆ పేరు మీద మోజుపడ్డ బాపినీడు, చిరంజీవిని ఒప్పించి మరీ దాన్నే టైటిల్‌గా పెట్టారు.
గ్యాంగ్ లీడర్ సినిమాకు బప్పీలహరి సంగీతం సమకూర్చగా పాటలన్నీ బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. వానా వానా వెల్లువాయె, భద్రాచలం కొండ, సండే అననురా అంటూ సాగే పాటలు అందరి నోళ్లలోనూ వినిపించేవి. అప్పట్లో కొన్నేళ్ళ పాటు గ్యాంగ్ లీడర్ సినిమా పాటలు వినపడని ఊరు, ఊగిపోని కుర్రకారు లేదు. ఈ పాటలకు సినిమాలో చిరంజీవి చేసిన డ్యాన్సులకు ధియేటర్లలు దద్దరిల్లిపోయాయి. చిరంజీవి-విజయశాంతి కాంబినేషన్ ఆకట్టుకుంది. ఈ సినిమాలోని వానా వానా వెల్లువాయ సాంగ్‌ను 2012లో రామ్‌చరణ్ నటించిన రచ్చ సినిమాలో రీమిక్స్ చేశారు. మాగంటి రవీంద్రనాధ్ చౌదరి నిర్మాతగా శ్యాంప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్‌పై గ్యాంగ్ లీడర్ సినిమాను నిర్మించారు. అంతకుముందు ఏడాది జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాతో మెగాస్టార్ చిరంజీవి నెలకొల్పిన ఇండస్ట్రీ రికార్డును గ్యాంగ్ లీడర్ సినిమా చెరిపివేసింది. ఈ సినిమాలో డైలాగులు చాలా పాపులర్ అయ్యాయి. చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉందో.. రఫ్ఫాడించేస్తాను అనే డైలాగ్ అందరి నోట వినిపించేది. ఈ సినిమా శతదినోత్సవ వేడుకలను ఒకేరోజు హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, ఏలూరు నగరాల్లో హెలికాఫ్టర్లలో వెళ్లి నిర్వహించారు.