
టాలీవుడ్‌లో మెగా కుటుంబానికి, మంచు కుటుంబానికి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత ఏడాది జరిగిన మా ఎన్నికల్లో ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. చిరంజీవి వర్గం మంచు విష్ణుకు కాకుండా ప్రకాష్‌రాజ్‌కు మద్దతు ఇచ్చింది. దీంతో మంచు కుటుంబసభ్యులు బహిరంగంగానే మెగా కుటుంబంపై ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి మెగా, మంచు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా దసరా కానుకగా అక్టోబర్ 5న మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ విడుదలవుతోంది. అదే రోజున తన కొత్త సినిమా జిన్నా కూడా విడుదలవుతుందని మంచు విష్ణు ప్రకటించాడు. దీంతో అక్టోబర్ 5న మరోసారి మీడియాకు సరుకు దొరికేసిందని అందరూ భావించారు. మంచు హీరో కావాలనే కాలు దువ్వుతున్నాడని అనుకున్నారు. కట్ చేస్తే చిరంజీవి కోసం మంచు విష్ణు త్యాగం చేశాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను మేకర్స్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 5న చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్, నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో తన సినిమాకు థియేటర్లు దొరకడం కష్టతరం అని భావించిన మంచు విష్ణు వివాదానికి పోకుండా జిన్నా మూవీ విడుదలను వాయిదా వేసుకున్నట్లు సినీ వర్గాలు చెప్తున్నాయి. జిన్నా మూవీ విడుదల గురించి సోషల్ మీడియాలో తెలియగానే నెటిజన్‌లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. మా ప్రెసిడెంట్ గారు భయపడినట్టున్నారు అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మంచి నిర్ణయం తీసుకున్నారని.. ఏ సినిమా లేనప్పుడు రిలీజ్ చేసుకుంటే.. కనీసం వసూళ్లయినా వస్తాయని ఇంకొందరు కామెంట్స్ చేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కొంత కాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విష్ణు జిన్నా సినిమాతో మళ్లీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీని ఇషాన్ సూర్య తెరకెక్కిస్తుండగా కోన వెంకట్ కథ అందిస్తూ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అటు జిన్నా సినిమాను అక్టోబర్ 21వ తేదీకి పోస్ట్ పోన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి ఫన్ ఎలిమెంట్స్‌తో మాస్‌ను ఆకట్టుకునేలా ఉంది. టీజర్‌ను బట్టి చూస్తే సినిమాలో హారర్ బ్యాక్ డ్రాప్ కూడా ఉందని తెలుస్తోంది. టీజర్‌ను చూస్తుంటే విష్ణు హిట్ కొట్టేలా ఉన్నాడని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కెరీర్‌లో ఇప్పటివరకు ఢీ, దేనికైనా రెడీ సినిమాలు తప్పితే మరో హిట్ లేని విష్ణు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుుకున్నాడు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నాడు. హాస్య కథాచిత్రాల స్పెషలిస్ట్ గా పేరు గాంచిన జి.నాగేశ్వర రెడ్డి ఈ సినిమాకి కథ అందిస్తున్నాడు. ఈ సినిమాలో ఒక పాటను విష్ణు కుమార్తెలు అరియనా, వివియానా పాడినట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది.సింగర్స్‌గా వాళ్ళకు ఇదే తొలి పాట అని తెలుస్తోంది.