
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఈ ఏడాది హిట్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియుమ్‌కు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. తెలుగు నేటివిటీకి తగ్గట్లు కొన్ని మార్పులు చేసి త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే రాశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన ఈ చిత్రం ఒపెనింగ్ డే నుండి భారీ వసూళ్లను సాధించింది. పవన్ కళ్యాణ్‌ను పవర్‌స్టార్ అభిమానులు ఎలాగైతే చూడాలనుకున్నారో.. దర్శకుడు సాగర్ కె. చంద్ర భీమ్లానాయక్‌లో పవన్‌ను అలా చూపించాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. నేరస్తుల దగ్గర కోపం, భార్య దగ్గర ప్రేమ, పై అధికారుల దగ్గర వినయం ఇలా పలు రకాల ఎమోషన్‌లతో పవన్ నటించగా అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. యంగ్ హీరో రానా దగ్గుబాటి విలన్‌గా ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించాడు. పవన్ సరసన నిత్యామీనన్, రానా సరసన సంయుక్త మీనన్ ఈ సినిమాలో నటించారు.
అయితే ఈ సినిమా తొలుత పవన్ దగ్గరకు వెళ్లలేదట. ఈ విషయాన్ని భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ స్వయంగా చెప్పాడు. ఈ మూవీని బాలయ్య కోసం ప్లాన్ చేశామని.. బాలయ్యకు ఈ విషయం చెప్పి మలయాళంలో ఉన్న అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా చూడమని చెప్పామని తెలిపాడు. అయితే బాలయ్య సినిమా చూసిన తర్వాత నాగవంశీతో ఈ సినిమా పవన్ కళ్యాణ్‌కు అయితే బావుంటుందని సలహా ఇచ్చాడట. దాంతో ఈ కథ పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లిందట. పవన్ పాత్రను బాలయ్య చేసుంటే ఇంకో లెవల్లో ఉండేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరేమో పవన్ కరెక్ట్ సెట్టయ్యాడని, బాలయ్య బీజూ మీనన్ పాత్రకు సెట్ కాడని వెల్లడిస్తున్నారు. కాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ తాజాగా బాలయ్య టాక్ షో అన్‌స్టాపబుల్‌కు హాజరయ్యాడు. ఇప్పటికే అన్ స్టాపబుల్ సీజన్2 విజయవంతంగా ముందుకు దూసుకుపోతోంది. తొలి ఎపిసోడ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ హాజరై సందడి చేశారు.
ఇక రెండో ఎపిసోడ్‌లో యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్దూ జొన్నలగడ్డ హాజరయ్యారు. నిర్మాత నాగవంశీ కూడా వీరితో జాయిన్ అయ్యాడు. అయితే నాగవంశీ ఎంట్రీ ఇచ్చి భీమ్లా నాయక్ సినిమా ముచ్చట్లు తీసుకొచ్చాడు. అసలే భీమ్లా నాయక్ సినిమా విషయంలో రకరకాల టాక్స్ నడిచాయి. ఈ సినిమాను బాలయ్య, వెంకీ, రానా ఇలా చాలా మందితో ట్రై చేశారనే టాక్ వచ్చింది. రవితేజ కూడా నటిస్తాడనే టాక్ కూడా వచ్చింది. ఇప్పుడు తాజాగా భీమ్లా నాయక్ విషయం మీద బాలయ్య స్పందించాడు. సాధారణంగా మన హీరోలు చాలా మంది.. తమ వద్దకు వచ్చే సినిమాలను.. ఎవరికి బాగా సూట్ అవుతుందో చెప్పి వారిని సజెస్ట్ చేస్తుంటారు. అలా తన వద్దకు వచ్చిన భీమ్లా నాయక్ సినిమాను పవన్ కళ్యాణ్‌కు అయితే బాగుంటుందని బాలయ్య సూచించాడు. దీంతో మా బాలయ్య గోల్డురా అంటూ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. కల్మషం లేని మనిషిరా బాలయ్య అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ ఉందనే ప్రచారం జరుగుతుంటుంది. కానీ అది నిజం కాదని ఈ ఘటనతో అర్థమైంది.