
పవన్ కళ్యాణ్ సినిమాల్లో జల్సా మూవీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. త్రివిక్రమ్‌తో పవన్ నటించిన తొలి సినిమా ఇదే. అందులోనూ మహేష్‌బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన మూవీ కూడా. ఈ మూవీలోని పాటలు ఇప్పటికీ చాలా చోట్ల వినిపిస్తూనే ఉంటాయి. 2008లో వచ్చిన ఈ మూవీకి 14 ఏళ్లు దాటినా క్రేజ్ తగ్గలేదు. తాజాగా సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 1న తెలుగురాష్ట్రాలలో చాలా చోట్ల ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో ఎక్కుతుందని ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఈ మూవీ స్పెషల్ షోలను ఏకంగా వెయ్యి వరకు ప్రదర్శించేలా అభిమానులు ఏర్పాట్లు చేశారని టాక్ నడుస్తోంది. ఇప్పటివరకు 500 షోలుగా ప్రచారం జరగ్గా ఇప్పుడు ఈ సంఖ్య వెయ్యికి చేరుతుందన్న అంచనాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అందులోనూ అన్ని షోలు ఫుల్స్ అయ్యాయని.. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు పెట్టిన కాసేపటికే ఫుల్ అయిపోతున్నాయని అభిమానులు అంటున్నారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జల్సా మూవీకి సంబంధించిన చర్చే జరుగుతోంది.
ఇప్పటివరకు రీ రిలీజ్‌లో వెయ్యి షోలను ఎప్పుడూ ప్రదర్శించిన దాఖలాలు లేవని.. అందుకే ఇప్పుడు జల్సా మూవీ గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కుతుందని పవన్ అభిమానులు గర్వంగా చెప్తున్నారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వసూళ్లన్నీ జనసేన పార్టీకి ఫండ్ రూపంలో ఇవ్వాలని అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో జల్సా మూవీ స్పెషల్ షోలు ప్రదర్శించనున్నారు. జల్సా సినిమాను హైదరాబాద్‌లో సెప్టెంబర్ 1న భారీగా ప్రదర్శించేందుకు సిద్దమవుతున్నారు. కొత్త సినిమాకు ముస్తాబు చేసినట్టుగా థియేటర్లను అభిమానులు కటౌట్స్, ఫ్లెక్సీలతో అలంకరిస్తున్నారు. మూడు రోజుల ముందుగానే అభిమానులు తోరణాలు, భారీ పోస్టర్లను కట్టడంలో తలమునకలై ఉన్నారు. ప్రసాద్ మల్టీ ప్లెక్స్‌లో ఏకంగా 17 షోలు ప్రదర్శిస్తున్నారు. సంధ్య, సుదర్శన్, దేవీ థియేటర్లతోపాటు పలు మల్టీప్లెక్స్‌లో ప్రత్యేక షోలు ప్రదర్శిస్తున్నారు. మొత్తం 56 షోలు ప్రదర్శిస్తుండగా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 45 లక్షలు వసూలైంది. దాదాపు 82 శాతం అక్యుపెన్సీ నమోదైంది.
జల్సా మూవీని గెలుగు రాష్టాలలోనే కాకుండా గుజరాత్, మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాలలోనూ ప్రదర్శిస్తున్నారు. వడోదర లోని పరుల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ సెప్టెంబర్ 1వ తేదీ 10 గంటలకు ఐనాక్స్ తక్ష్ గెలాక్సీలో జల్సాను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ షోకు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అమెరికాలో జల్సా స్పెషల్ షోలకు అభిమానులు పొటెత్తుతున్నారు. యూఎస్‌లో మొత్తం 28 లొకేషన్లలో షోలు ప్రదర్శించేందుకు ఏర్పాటు చేయగా.. మొత్తం 876 టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో ఈ చిత్రం 8635 అమెరికన్ డాలర్లను వసూలు చేసింది. ఇక పోకిరి సినిమాను 11 లొకేషన్లలో ప్రదర్శించగా 6135 డాలర్లను వసూలు చేసింది. జల్సా మూవీ నక్సలిజం బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కింది. అయితే దీన్ని కూడా కామెడీ చేశాడని త్రివిక్రమ్‌పై విమర్శలు వచ్చాయి. అయితే సినిమా ఎలా ఉన్నా కూడా ప్రతీ సీన్‌లోనూ త్రివిక్రమ్ తన మ్యాజిక్ చూపించాడు. మాటలతో మాయ చేశాడు. కామెడీతో పాటు ఆలోచింపజేసే మాటలు, డైలాగ్‌లకు జల్సా కేరాఫ్ అడ్రస్. విలన్‌ను రక్తపు చుక్క రాకుండా ఒక్కసారి కూడా ఆయన్ని కొట్టకుండా చంపే క్లైమాక్స్ కూడా అద్భుతమే. మరోవైపు పవన్ బర్త్ డే రోజు తమ్ముడు సినిమాను కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ల ద్వారా 13.69 లక్షల వసూళ్లను రాబట్టడం రికార్డుగా అభిమానులు చెప్పుకుంటున్నారు.