
టాలీవుడ్ ముద్దుగా పిలుచుకునే రెబల్ స్టార్ కృష్ణంరాజు సెప్టెంబర్ 11న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన అంత్యక్రియలు, దశదిన కర్మ కార్యక్రమాలను హైదరాబాద్‌లోనే నిర్వహించారు. తెలుగు సినీ పరిశ్రమకు కృష్ణంరాజు లేని లోటు పూడ్చలేనిది అంటూ పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో కృష్ణంరాజు సంస్మరణ సభను గురువారం నాడు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్‌తో పాటు కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో అభిమానులు హాజరవ్వడంతో మొగల్తూరు కిక్కిరిసిపోయింది. కృష్ణంరాజు సంస్మరణ సభకు మంత్రి రోజాతో పాటు పలువురు ఏపీ ప్రజాప్రతినిధులు కూడా హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సభ కోసం 75వేల మంది అభిమానులు తరలివచ్చినట్లు తెలుస్తోంది. వీరిని కంట్రోల్ చేయడానికి 500 మంది పోలీసులు తమ విధులను నిర్వహించారు. ఎలాంటి తొక్కిసలాట జరగకుండా పోలీసులు పహారా కాశారు.
మాములుగానే గోదావరి ప్రజలు అతిథి మర్యాదలకు ఎంతో విలువ ఇస్తారు. అలాంటిది కృష్ణంరాజు సంస్మరణ సభకు వచ్చే అభిమానుల కోసం ఎలాంటి ఏర్సాట్లు చేశారో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోవడం ఖాయం. కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం లక్ష మందికి నోరూరించే వంటకాలను ప్రభాస్ కుటుంబ సభ్యులు సిద్ధం చేసి వడ్డించారు. ఇందుకోసం 2 నుంచి 3 కోట్ల రూపాయల వరకు ప్రభాస్ ఖర్చు పెట్టినట్లు టాక్ నడుస్తోంది. కృష్ణంరాజు బ్రతికున్న రోజుల్లో ఆయన వద్దకు సామాన్యులు వచ్చినా, సెలబ్రిటీలు వచ్చినా మంచి ఆతిథ్యం ఇచ్చి, కడుపునిండా భోజనం పెట్టి పంపేవారు. ఇప్పుడు ఆయన చనిపోయినా కూడా కుటుంబసభ్యులు ఈ ఆచారాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో 50 రకాల వంటకాలతో విందును ప్రభాస్ ఏర్పాటు చేయించడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ మొగల్తూరుకు రావడంతో అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తనను చూసేందుకు వచ్చిన వారందరికీ ప్రభాస్ అభివాదం చేస్తూ కనిపించాడు.
అటు మొగల్తూరు వచ్చిన అభిమానులకు ప్రభాస్ కుటుంబీకులు రాయల్ బాహుబలి మెనూకు ఏ మాత్రం తగ్గకుండా వంటకాలను వడ్డించారు. మొత్తం 12 టన్నుల మటన్, చికెన్ బిర్యానీ, 6 టన్నుల మటన్ కర్రీ, 6 టన్నుల చికెన్ కర్రీ, 4 టన్నుల చికెన్ ఫ్రై, 2 టన్నుల ఫిష్ ఫ్రై, 2 టన్నుల ఫిష్ కర్రీ, 2 టన్నుల ప్రాన్స్ కర్రీ, ఒక టన్ను రొయ్యల ఇగురు, 2 టన్నుల స్టఫ్డ్ క్రాబ్, ఒక టన్ను రొయ్యల గోంగూర ఇగురు, ఒక టన్ను బొమ్మిడాయల పులుసు, 2 లక్షల బూరెలు తయారు చేశారు. మొత్తం 22 రకాల నాన్ వెజ్ వంటకాలను సిద్ధం చేశారు. అంతేకాకుండా ఇంకా అనేక రకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలను వడ్డించారు. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రోజా కృష్ణంరాజు కోసం ప్రత్యేకంగా స్మృతివనం ఏర్పాటు చేస్తామని.. దీని కోసం ప్రభుత్వం నుంచి రెండు ఎకరాలను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఉప్పలపాటి వంశీయులకు ఎంత ఆదరణ ఉందని, కృష్ణంరాజు సినిమాల్లో రెబల్ స్టార్ రాజకీయాల్లో పీపుల్స్ స్టార్ అని కొనియాడారు. కాగా ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రభాస్ ప్రత్యేక బస్సులో హైదరాబాద్‌కు పయనమయ్యాడు. భారీగా తరలివచ్చిన అభిమానుల నడుమ అతికష్టం మీద బస్సు వద్దకు చేరుకున్నాడు.