
దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ రెండు వారాలు పూర్తి చేసుకుంది. తొలి వీకెండ్‌లో జోరు చూపించిన గాడ్ ఫాదర్ ఆ తర్వాత చప్పబడ్డాడు. ఫస్ట్ వర్కింగ్ డే సోమవారం నాడు తెలుగు రాష్ట్రాలలో 70 శాతం వసూళ్లు పడిపోయాయి. మలయాళ సూపర్ హిట్ లూసీఫర్‌కు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలిరోజే హిట్ టాక్ అందుకుంది. మెగాస్టార్ గత చిత్రం ఆచార్య ఫ్లాప్‌తో నీరసించిపోయిన మెగా అభిమానులకు ఈ సినిమా హిట్ కొద్దిగా ఊరటను కలగజేసింది. ఇందులో మెగాస్టార్ స్వాగ్ ను చూసి మెగా అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత మెగాస్టార్ తనకు తగ్గ మూవీని చేశాడని ప్రశంసలు కూడా లభించాయి. అయితే నయనతార చిరు చెల్లెలుగా కనిపించడం కొంతమంది అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.
గాడ్ ఫాదర్ మూవీ తెలుగుతో పాటు హిందీలోనూ విడుదలైంది. సల్మాన్ ఖాన్ నటించడంతో బాలీవుడ్‌లోనూ ఈ మూవీ మంచి వసూళ్లను సొంతం చేసుకుంది. బాలీవుడ్‌లో రెండు వారాలకు ఈ మూవీ రూ.18 కోట్ల నెట్ వసూళ్లను సొంతం చేసుకుంది. విడుదలైన 10 రోజులకే ఈ మూవీ బాలీవుడ్‌లో రూ.15 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ విశ్లేషకులు తెలిపారు. గాడ్ ఫాదర్ హిందీ వెర్షన్‌కు చూపిస్తున్న విశేష ఆదరణకు నార్త్ ఆడియన్స్‌కు చిరంజీవి ప్రత్యేకంగా థాంక్స్ తెలియజేశారు. ఓవరాల్‌గా ఈ మూవీ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన చిరంజీవి మూడో సినిమాగా రికార్డులకెక్కింది. గతంలో ఖైదీనంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలు కూడా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి. నయనతార, సత్యదేవ్ నటించిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. గాడ్ ఫాదర్ మూవీకి నార్త్‌లో వచ్చిన బాక్సాఫీసు కలెక్షన్స్‌లో మేజర్ పార్ట్ ఈస్ట్ పంజాబ్ నుంచి ఉంది. 11 శాతం వసూళ్లు అక్కడి నుంచే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. సాధారణంగా సౌత్ సినిమాలకు అక్కడ 6 శాతమే ఇప్పటి వరకు అధికం అని అంటున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీకి 11 శాతం వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
గాడ్ ఫాదర్ సినిమాను పలువురు సెలబ్రిటీలు కూడా వీక్షించి ప్రశంసలు కురిపించారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ మూవీని వీక్షించి తనదైన శైలిలో రివ్యూ చెప్పారు. ఈ విషయాన్ని డైరెక్టర్ మోహన్ రాజా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. సూపర్ స్టార్ గాడ్ ఫాదర్ సినిమాను వీక్షించారు. అద్భుతం.. చాలా బావుంది.. ఎంతో ఆసక్తిగా తెరకెక్కించారు అని చెప్పడంతో పాటు తెలుగు వెర్షన్‌లో ఉన్న కొన్ని పొరపాట్లను కూడా తెలిపారు. తలైవా ధన్యవాదాలు.. నా జీవితంలో మర్చిపోలేని క్షణాల్లో ఇది ఒకటి అంటూ మోహన్ రాజా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు చిరంజీవి, రజనీకాంత్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ట్వీట్‌తో వారిద్దరి అనుబంధం మరోసారి బయటపడింది.