
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ రెండో వారం ప్రదర్శింపబడుతోంది. అయితే హిట్ టాక్, పాజిటివ్ రివ్యూలు వచ్చినా ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్‌కు రాలేదు. దీంతో రెండో వారం వసూళ్లు కీలకంగా మారాయి. కానీ ఓ డబ్బింగ్ సినిమా గాడ్ ఫాదర్ మూవీకి భారీగా దెబ్బ వేసిందనే టాక్ వినిపిస్తోంది. ఆ సినిమానే కాంతార. సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలతో పాటు శాండల్ వుడ్‌లో కలెక్షన్ల పరంగా కూడా రికార్డులను సాధించింది. కేవలం 15 రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసిన సినిమాగా నిలిచింది. దీంతో సోషల్ మీడియాలో ఈ మూవీ పేరు హాట్ టాపిక్‌గా మారింది. అటు పలువురు సెలబ్రిటీలు కూడా కాంతార మూవీని ఆకాశానికి ఎత్తేశారు. ఈ నేపథ్యంలో ఈ మూవీని డబ్బింగ్ చేసి తెలుగు, తమిళం, హిందీ వంటి భాషల్లోనూ విడుదల చేశారు. తెలుగులో చిరంజీవి బావ అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ మూవీని విడుదల చేసింది.
తెలుగులో తొలిరోజే కాంతార మూవీ బ్రేక్ ఈవెన్ సాధించింది. కేవలం రూ.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే చేసిన ఈ మూవీ పాటిజివ్ టాక్ రావడంతో తొలిరోజే రూ.4 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు, రూ.2.5 కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో రెండో రోజు థియేటర్ల సంఖ్య కూడా పెరిగింది. రెండో రోజు ఆదివారం కావడంతో చాలా చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు కూడా దర్శనమిచ్చాయి. దీంతో మరిన్ని వసూళ్లను కాంతార మూవీ కొల్లగొట్టనుంది. ఈ మేరకు గాడ్ ఫాదర్ మూవీ వసూళ్లకు కాంతార మూవీ ఎసరు పెట్టిందని పలువురు చర్చించుకుంటున్నారు. తొలివారం 710 థియేటర్ల నుంచి రెండోవారానికే 300 థియేటర్లకు గాడ్ ఫాదర్ స్క్రీన్‌లు తగ్గిపోవడం కూడా ఈ మూవీ వసూళ్లపై ఎఫెక్ట్ పడింది.
కాగా ఇటీవల ధనుష్ నటించిన నేనే వస్తున్నా మూవీని కూడా గీతా ఆర్ట్స్ సంస్థ విడుదల చేసింది. కానీ ఈ మూవీ అనుకున్న స్థాయిలో వసూళ్లను సాధించలేదు. అయితే ఇప్పుడు కన్నడ డబ్బింగ్ మూవీతో అల్లు అరవింద్ లాభాలను కళ్ల చూస్తున్నారని టాక్ నడుస్తోంది. ఓ తమిళ డబ్బింగ్ మూవీతో పోగొట్టుకున్న డబ్బుల్ని మరో కన్నడ డబ్బింగ్ మూవీతో సంపాదిస్తూ బిజినెస్‌లో అల్లు అరవింద్ తన స్ట్రాటెజీని చూపించారు. మరోవైపు బావ సినిమా అయినా సరే బిజినెస్ ఈజ్ బిజినెస్ అన్న తన ఫార్ములాని ప్రూవ్ చేసుకున్నాడు. అటు కాంతార మూవీని రిషబ్ శెట్టి ఒంటిచేత్తో నడిపించాడని ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా రూ.90 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగిన చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ ఫుల్ రన్‌లో కేవలం రూ.60 కోట్లు మాత్రమే వసూలు చేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.