
ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్ సినిమాల హవా నడుస్తోంది. కొత్త సినిమాల కంటే రీ రిలీజ్ సినిమాలకు ఎక్కువ వసూళ్లు వస్తుండటంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా ఈ సినిమాల పట్ల మక్కువ చూపిస్తున్నారు. గత ఏడాది పోకిరి, జల్సా, చెన్నకేశవరెడ్డి లాంటి సినిమాలకు మంచి వసూళ్లు వచ్చాయి. ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా పవన్ కళ్యాణ్ నటించిన ఇండస్ట్రీ హిట్ మూవీ ఖుషి సినిమాను కూడా రిలీజ్ చేశారు. ఖుషి సినిమాకు ఎక్కడ చూసినా అదిరిపోయే రీతిలో వసూళ్లు వచ్చాయి. అవతార్, ధమాకా లాంటి సినిమాలను కూడా పక్కనపెట్టి థియేటర్ల యజమానులు ఖుషి సినిమాను ప్రదర్శించేందుకు ఆసక్తి చూపించారు. దీంతో రీ రిలీజ్ సినిమాల చరిత్రలోనే ఖుషి అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా నిలిచింది. ఇప్పుడు మరో మూవీ రీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మహేష్‌బాబు కెరీర్‌ను మలుపు తిప్పిన మాస్ మూవీ ఒక్కడు ఈనెల 7న విడుదలవుతోంది.
ఒక్కడు సినిమా విడుదలై 20 ఏళ్లు కావొస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమాను ప్రత్యేకంగా 4కేలోకి మార్చి సౌండ్ సిస్టమ్‌ను మెరుగుపరిచి మరోసారి థియేటర్లలోకి రిలీజ్ చేస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించి.. మేకర్స్‌కు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాలో భూమికా చావ్లా హీరోయిన్గా నటించగా.. ప్రకాష్ రాజ్ విలన్‌గా నటించాడు. ముఖేష్ రిషి, అజయ్, తెలంగాణ శకుంతల కీలక పాత్రల్లో నటించారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పై ఎంఎస్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందించాడు. మణిశర్మ అందించిన పాటలు మ్యూజిక్ లవర్స్ ఆల్ టైమ్ ఫేవరేట్ హిట్ లిస్టులో ఉంటాయి. రూ.14 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.30 కోట్ల షేర్‌ను సాధించి డబుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ముఖ్యంగా ఒక్కడు సినిమాలో మహేష్ బాబు-భూమిక కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
అయితే రీ రిలీజ్లో ఒక్కడు సినిమా ఖుషి సినిమా వసూళ్లను దాటుతుందా అనే ప్రశ్న ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. రీ రిలీజ్ సినిమాలకు పోకిరి సినిమా ట్రెండ్ సెట్ చేయగా జల్సా సినిమా రికార్డులను కొల్లగొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే జల్సా మూవీ ఇప్పటివరకు రూ.3.2 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించగా ఇటీవల విడుదలైన ఖుషి మూవీ రూ.4.15 కోట్లు సాధించింది. ఈ జాబితాలో మూడో స్థానంలో మహేష్‌బాబు పోకిరి మూవీ రూ.1.73 కోట్లు, బాలయ్య చెన్నకేశవరెడ్డి రూ.1.10 కోట్లు, ప్రభాస్ బిల్లా మూవీ రూ.1.05 కోట్లు సాధించాయి. దీంతో ఈనెల 7న విడుదలయ్యే ఒక్కడు మూవీ రూ.5 కోట్ల షేర్ వసూలు చేస్తుందా అనే విషయం పెద్ద ప్రశ్నగా మారింది. మరోవారంలో సంక్రాంతికి కొత్త సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. ప్రస్తుతం అవతార్, ధమాకా, 18 పేజీస్ తప్ప థియేటర్లలో ప్రదర్శింపబడే చిత్రం ఒక్కటి కూడా లేదు. చాలా థియేటర్లు ఫీడింగ్ కోసం ఖుషి, ఒక్కడు లాంటి సినిమాలను ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే టీవీలలో చాలాసార్లు టెలీకాస్ట్ అయిన ఒక్కడు సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తుందో లేదో చూడాలంటే ఈనెల 7వ తేదీ వరకు మహేష్ అభిమానులు వెయిట్ చేయాల్సిందే.