
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ కోబ్రా. విభిన్న గెటప్పుల్లో విక్రమ్ ఈ సినిమాలో కనిపిస్తాడు. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లో కూడా తెరకెక్కింది. గత నెల 31న విడుదలైన ఈ మూవీ తొలిరోజే మిక్సుడ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో తొలిరోజు మోస్తరు వసూళ్లు రాబట్టిన ఈ మూవీ రెండో రోజు నుంచి డౌన్ ఫాల్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు తగ్గినా తమిళంలో మాత్రం ఈ సినిమాను ఆదరించారు. అటు ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఓవరాల్‌గా ఈ మూవీ క్లోజింగ్ అయ్యేనాటికి ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే రూ.6 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగులో పలు చోట్ల ప్రాఫిట్ వెంచర్‌గా నిలిచినా చాలా ప్రాంతాల్లో డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ కోబ్రా మూవీని భారీ స్థాయిలో నిర్మించారు. టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రముఖ పాత్ర పోషించాడు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకు స్వరాలను అందించారు. అజయ్ జ్ఞాన్‌ముత్తు దర్శకత్వం వహించారు. కథ విషయానికి వస్తే ఒడిశా సీఎం దారుణంగా హత్యకు గురవుతాడు. కొన్నాళ్ల వ్యవధిలోనే బ్రిటీష్ యువరాజు కూడా చనిపోతాడు. అయితే ఈ హత్యల వెనుక ఎవరు ఉన్నారో పోలీసులు విచారణ చేపడతారు. కానీ ఈ హత్యలను ఒక్కరే చేస్తున్నారని తెలుసుకుని ఆశ్చర్యపోతారు. అయితే అధికారుల నుంచి అతడు ఎలా తప్పించుకున్నాడు అన్న పాయింట్ మీదే సినిమా నడుస్తుంది. అయితే కొంత సినిమా తర్వాత రొటీన్ బాట పట్టడంతో ప్రేక్షకులకు ఈ కథ రుచించలేదు. ఈ మూవీలో వివిధ గెటప్స్‌లో విక్రమ్ మాత్రం నూటికి నూరు శాతం మార్కులు కొట్టేశాడు.
అపరిచితుడు మూవీ ద్వారా అసాధారణ ఫాలోయింగ్ తెచ్చుకున్న నటుడు విక్రమ్. అతడి నుంచి సినిమా వస్తుందంటే గతంలో ఆసక్తిగా ఎదురుచూసేవాళ్లు. అయితే అపరిచితుడు సినిమా వచ్చి 18 ఏళ్లు అవుతున్నా ఆ సినిమా తర్వాత విక్రమ్‌కు ఇప్పటివరకు నిఖార్సైన హిట్ దక్కలేదు. ఎన్ని వేషాలు వేసినా.. ఎన్ని సినిమాలు చేసినా మరో హిట్ కోసం అతడు పరితపిస్తూనే ఉన్నాడు. టాలెంట్ ఉన్న హీరో ఈ స్థాయిలో ఇన్నేళ్లు ఇబ్బందిపడటం సినీ చరిత్రలో ఇదే తొలిసారి కావొచ్చు. కాగా కోబ్రా మూవీ ఓటీటీ డేట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మూవీ యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. కోబ్రా మూవీ ఓటీటీ హక్కులను సోనీ లివ్ భారీ మొత్తానికి దక్కించుకుంది. సెప్టెంబరు 28 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సోనీ లివ్ సోషల్ మీడియాలో తెలిపింది. ఇందుకు సబంధించి కొత్త ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. అయితే ఏ భాషల్లో రిలీజ్ అవుతుందో క్లారిటీ ఇవ్వలేదు. అయితే సోనీ లివ్ యాప్ లో మాత్రం ఈ చిత్ర తమిళ వెర్షన్ అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొన్నారు.