
టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. కైకాల మరణంతో టాలీవుడ్ మరోసారి దిగ్భ్రాంతికి గురైంది. ఇటీవల రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ లాంటి నటులను కోల్పోయిన తెలుగు పరిశ్రమ ఇప్పుడు కైకాల లాంటి గొప్పనటుడిని కోల్పోవడంతో పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కైకాలకు పెద్ద కుమారుడు లక్ష్మీనారాయణ అంతిమ సంస్కారాలను నిర్వహించారు. కైకాల సత్యనారాయణ ఆరు దశాబ్దాల పాటు సుమారు 777 సినిమాల్లో నటించారు. నటుడిగా మాత్రమే కాకుండా అగ్రహీరోలతో సినిమాలను కూడా నిర్మించారు. ఎన్టీఆర్‌తో గజదొంగ, కృష్ణ, శోభన్‌బాబులతో ఇద్దరు దొంగలు, చిరంజీవితో చిరంజీవి, కొదమ సింహం, అక్కినేని నాగేశ్వరరావుతో బంగారు కుటుంబం, బాలకృష్ణతో ముద్దుల మొగుడు వంటి సినిమాలను నిర్మించిన కైకాల కేజీఎఫ్-1 లాంటి పాన్ ఇండియా సినిమాకు సమర్పకుడిగానూ వ్యవహరించారు. కేజీఎఫ్-2 మూవీకి సత్యనారాయణ సమర్పణ అని పడకపోయినా ఆయన వారసులు నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.
కైకాలకు నిర్మాతగా కొన్ని సినిమాలు డబ్బులు తెస్తే మరికొన్ని చిత్రాలు నష్టాలు మిగిల్చాయి. కైకాలకు మొత్తం నలుగురు సంతానం ఉన్నారు. ఆయనకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వీరంతా కూడా వారి జీవితంలో బాగా సెటిల్ అయ్యారు. కైకాల సత్యనారాయణ చాలా సినిమాల్లో నటించినా పెద్దగా ఆస్తులు కూడబెట్టలేకపోయారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే ఆయనకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. కైకాలకు హైదరాబాద్ నగరంలో నాగార్జున రెసిడెన్సీతో పాటు గచ్చిబౌలిలో ఒక అపార్టుమెంట్ ఉంది. ఈ ఇంటి ధర సుమారు 1.5 కోట్ల రూపాయల విలువ చేస్తుందని సమాచారం. అలాగే బెంగళూరులో కూడా కైకాలకు ఒక ఇల్లు ఉన్నట్లు టాక్ నడుస్తోంది. కైకాల వద్ద రెండు ఖరీదైన కార్లు ఉన్నాయని.. వీటి విలువ కూడా సుమారు కోటి రూపాయలు ఉంటుంది. వయసు మళ్లిన తర్వాత ఆస్తులు కరిగిపోవడంతో గత ఏడాది కైకాల తీవ్ర అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆ సమయంలో ఏపీ సీఎం జగన్ ఆయన ఆసుపత్రి ఖర్చులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం చేశారు.
కైకాల సత్యనారాయణ స్వగ్రామం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం. కౌతవరంలో తన తాత కంభంమెట్టు రామయ్య పేరిట ప్రభుత్వ ప్రసూతి కేంద్రం ఏర్పాటుకు కృషిచేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో సుమారు రూ.40లక్షల ప్రభుత్వ నిధులతో కొత్త ఆస్పత్రిని నిర్మించేలా చూశారు. కౌతవరం–చేవెండ్ర రోడ్డు నిర్మాణం కూడా ఆయన వల్లే సాధ్యమైందని అక్కడి గ్రామస్తులు అంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో యముడిగా కైకాల తనదైన ముద్ర వేశారు. హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఇలా అన్నిరకాల పాత్రలు పోషించి నవరసాలను పండించిన ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. యముడు, ఘటోత్కచుడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణాసురుడు వంటి పౌరాణిక పాత్రల్లో జీవించిన ఏకైక నటుడిగా క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే కైకాలకు ఒక కోరిక ఉండేది. చిరంజీవి, బాలకృష్ణ కలిసి ఒకే సినిమాలో నటిస్తే చూడాలని కోరిక ఉండేదని.. ఆ కోరిక తీరకుండానే ఆయన చనిపోయారని పలువురు మాట్లాడుకుంటున్నారు. చిరంజీవి, బాలకృష్ణ మల్టీస్టారర్ మూవీ చేస్తే అందులో నటించాలని కైకాల తెగ ఆరాటపడ్డారని సన్నిహితులు అంటున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ జంటగా నటించిన ఆర్‌ఆర్‌ఆర్ మూవీ చూసి కైకాల చాలా సంతోషించినట్లు తెలుస్తోంది.