
తన పెద్దనాన్న కృష్ణంరాజు మరణించడంతో టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ విషాదంలో ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, మారుతి సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. అయితే గత నెలలో తన పెద్దనాన్న కృష్ణంరాజు ఆస్పత్రి పాలైన నాటి నుంచి ప్రభాస్ కూడా కొంచెం దిగులుతోనే కనిపిస్తున్నాడు. పలుమార్లు ఆస్పత్రికి కూడా వెళ్లొచ్చాడు. తెలుగు చలన చిత్ర సీమలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న నటుడు కృష్ణంరాజు. అయితే ఆదివారం తెల్లవారుజామున ఆయన మరణం చిత్ర సీమలో విషాదాన్ని నింపింది. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో రాజుల కుటుంబంలో కృష్ణంరాజు జన్మించారు. ఆయన తండ్రి పేరు ఉప్పలపాటి వీరవెంకట సత్యనారాయణ రాజు. కృష్ణంరాజు అసలు పేరు ఉప్పలపాటి చినవెంకట కృష్ణంరాజు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత అంత పెద్ద పేరు ఇబ్బందిగా ఉండటంతో కృష్ణంరాజుగా మార్చుకున్నారు.
అయితే కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారసులు లేకపోవడంతో ప్రభాస్‌నే తన వారసుడిగా ఆయన భావించేవాళ్లు. ప్రభాస్ కూడా కృష్ణంరాజు కుమార్తెలను తన సొంత అక్కాచెల్లెళ్ల మాదిరిగానే చూసుకునేవాడు. ప్రస్తుతం పెద్దనాన్న మరణించడంతో ఆయన కుమార్తెలను వారించడం ప్రభాస్‌కు చాలా కష్టంగా మారింది. ఒకవైపు బాధ దిగమింగుతూనే చెల్లెలెని ఓదారుస్తూ మీడియాకు కనిపించారు. ప్రభాస్ పెళ్లి చూడాలన్న తన చివరి కోరిక తీరకుండానే కృష్ణంరాజు స్వర్గస్తులయ్యారు. కృష్ణంరాజు వంశస్తులు విజయనగర సామ్రాజ్య వారసులు. ఆయన నరసాపురం వైఎన్ఎమ్ కాలేజీలో చదువుకున్నారు. పీయూసీ పరీక్ష ఫెయిలవడంతో హైదరాబాద్ నగరానికి వచ్చి మళ్లీ చదివి పాసయ్యారు. తర్వాత బీకామ్ పూర్తిచేశారు. ఆంధ్రరత్న పత్రికలో పనిచేశారు. ఈయన కబడ్డీ, వాలీబాల్‌లోనూ ప్లేయర్‌గా గుర్తింపు పొందారు. తర్వాత సినిమాలపై మక్కువతో చెన్నై చేరుకున్నారు.
1966లో చిలకా గోరింక చిత్రంతో కృష్ణంరాజు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. మొన్నటి రాధేశ్యామ్ మూవీ వరకు దాదాపు 186 చిత్రాల్లో నటించారు. ఆయనకు భక్తకన్నప్ప, తాండ్రపాపారాయుడు, భారతంలో శంఖారావం, త్రిశూలం, బ్రహ్మనాయుడు, అమరదీపం, మనఊరి పాండవులు, రంగూన్ రౌడీ, బొబ్బిలి బ్రహ్మన్న, బావాబావమరిది తదితర చిత్రాలు ఎంతో గుర్తింపునిచ్చాయి. తన తమ్ముడు కొడుకు ప్రభాస్‌తో బిల్లా, రెబల్, రాధేశ్యామ్ చిత్రాల్లో కలిసి నటించారు. రాధే శ్యామ్ సినిమాలో ఓ కీలక పాత్రలో కృష్ణంరాజు కనిపించారు. ఈ మూవీ షూటింగ్ సందర్భంగా ఇద్దరూ విదేశాలకు వెళ్లినప్పుడు రెబల్‌స్టార్ ట్రేడ్ మార్క్ పోజు ఇచ్చారు. గతంలో ఓ శుభకార్యంలో కృష్ణంరాజు జుట్టును ప్రభాస్ సరిచేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఫ్యాన్స్ వారి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కృష్ణంరాజు మరణంపై ప్రముఖులతో పాటు హీరోయిన్ అనుష్క దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మనసు చాలా గొప్పదని, ఎప్పటికీ అందరి హృదయాల్లో జీవించి ఉంటారని అనుష్క పేర్కొంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించింది. కృష్ణంరాజు మరణ వార్త విన్న తర్వాత మాటలు రావడం లేదని సీనియర్ నటుడు మోహన్‌బాబు ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కుటుంబం లెజెండ్, పెద్దాయనను కోల్పోయిందని మంచు విష్ణు ట్వీట్ చేశాడు.