
టాలీవుడ్‌లో ఆదివారం నాడు పెనువిషాదం నెలకొంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు అకస్మాత్తుగా మరణించడంతో సినీ లోకం దిగ్భ్రాంతికి గురైంది. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో కృష్ణంరాజు మరణించారు. ఇటీవల రాధేశ్యామ్ ప్రమోషన్లలో, ప్రభాస్ జన్మదిన వేడుకల్లోనూ కృష్ణంరాజు పాల్గొని ఆడిపాడారు. కానీ ఇంతలోనే ఇప్పుడు ఆయన విగతజీవిగా మారిపోయారు. అయితే కృష్ణంరాజుకు తన తమ్ముడి కుమారుడు ప్రభాస్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. తనకు వారసులు లేకపోవడంతో ప్రభాస్‌ను చిత్రసీమకు పరిచయం చేసి తన వారసుడిగా ప్రకటించారు. సినిమాల్లో ఎదిగేందుకు దగ్గరుండి ప్రోత్సహించారు. ప్రారంభంలో ప్రతి సినిమాను పెదనాన్న కృష్ణంరాజు సలహాతోనే నటించేవాడు. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ పలు సందర్భాల్లోనూ తన పెదనాన్న గురించి చెప్పేవాడు.
కృష్ణంరాజు మరణం పట్ల టాలీవుడ్ అగ్రహీరోలందరూ సంతాపం వ్యక్తం చేశారు. వీరిలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. కృష్ణంరాజు పార్ధివదేహం చూసి పవన్ కళ్యాణ్ కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక పంథాను కృష్ణంరాజు కలిగి ఉండేవారని.. రౌద్ర రస ప్రధానమైన పాత్రలను ఎంతగా మెప్పించేవారో కరుణ రసంతో కూడిన పాత్రల్లోనూ అలాగే ఒదిగిపోయావారు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలను పొందిన కృష్ణంరాజు గారి మరణవార్త వినగానే షాక్‌కు గురైనట్లు పవన్ తెలిపారు. ఇటీవల కాలంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారని తెలిసినప్పుడు కోలుకుంటారని భావించానని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆకాంక్షించారు. 1978లో మనవూరి పాండవులు సినిమాలో కృష్ణంరాజు గారితో కలిసి అన్నయ్య చిరంజీవి నటించినట్లు పవన్ కళ్యాణ్ గుర్తుచేసుకున్నారు.
కాగా రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన బర్త్ డేని కుటుంబసభ్యులతో కలిసి జరుపుకోవడం అలవాటు. ఈసారి కూడా అక్టోబర్ 23కు పెద్దనాన్న కుటుంబంతో హ్యాపీగా గడుపుదామని అనుకున్న ప్రభాస్‌కు కృష్ణంరాజు మరణం విషాదాన్ని నింపిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. విలన్, సపోర్టింగ్ హీరో, హీరో సహా అనేక విలక్షణ పాత్రలు పోషించిన కృష్ణంరాజు సినీ కెరీర్‌లో చాలా అవార్డులు పొందారు. 1977లో తొలిసారి నంది అవార్డుల ప్రదానోత్సవం జరగగా.. ఉత్తమ నటుడిగా తొలి నంది అందుకుంది వీరే. ఆ తర్వాత 1984లోనూ నంది పొందారు. 1986లో ఫిలింఫేర్, 2006లో ఫిలింఫేర్ దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారం వంటివి రెబల్ స్టార్‌ను వరించాయి. గతేడాది కృష్ణంరాజు కాలుకి సర్జరీ జరిగింది. గత నెల 5న పోస్టు కోవిడ్ సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి నెల రోజులుగా వెంటిలేటర్‌పైనే వైద్యులు చికిత్స అందించారు. కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతినడం, డయాబెటిస్, తీవ్రమైన కార్డియాక్ అరెస్టుతో రెబల్ స్టార్ మరణించారని పేర్కొన్నారు. కాగా కృష్ణంరాజు గతంలో రెండు సార్లు కరోనా బారిన పడ్డారు. పోస్ట్ కోవిడ్ సమస్యలు ఆయన్ను ఉక్కిరి బిక్కిరి చేయడంతోనే తుదిశ్వాస విడిచారు. రెబల్ స్టార్ అంత్యక్రియలు హైదరాబాద్‌లో సోమవారం జరుగుతాయని సన్నిహిత వర్గాలు తెలిపాయి.