
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ వసూళ్లు రోజురోజుకు పడిపోతున్నాయి. ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చినా ఇంకా బ్రేక్ ఈవెన్ కాకపోవడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పోటీకి ఎలాంటి సినిమా లేకపోయినా ఈ సినిమా బయ్యర్లకు సేఫ్ ప్రాజెక్టు కాలేకపోయింది. డబ్బింగ్ సినిమా కాంతార తప్పితే మరో సినిమా గాడ్ ఫాదర్‌కు పోటీ లేదు. అయినా ఈ మూవీని థియేటర్లకు వచ్చి చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడలేదంటే దానికి కారణం రీమేక్ అని కొందరు భావిస్తున్నారు. మలయాళ మూవీ లూసీఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ బాగానే ఉన్నా చాలా మంది ఓటీటీలో లూసీఫర్ తెలుగు రీమేక్‌ను వీక్షించారు. అసలే ఓటీటీలకు అలవాటు పడిన జనాలను థియేటర్లకు రప్పించాలంటే బీభత్సమైన కంటెంట్ తప్పనిసరి అవుతోంది. ఇటీవల టాలీవుడ్‌లో రిలీజైన సినిమాలు ఈ నిజాన్ని స్పష్టం చేశాయి. బింబిసార, సీతారామం, కార్తీకేయ-2 సినిమాలలో కంటెంట్ ఉండటంతోనే తెలుగు ప్రేక్షకులు ఆదరించారు.
ముఖ్యంగా నిఖిల్ నటించిన కార్తీకేయ-2 సినిమా అద్భుత వసూళ్లను సాధించింది. బయ్యర్లకు ఈ మూవీ డబుల్, ట్రిబుల్ లాభాలను అందజేసింది. అప్పటివరకు స్తబ్దుగా ఉన్న తెలుగు సినీ పరిశ్రమకు ఈ మూవీ వసూళ్లు ప్రాణం పోశాయి. కార్తీకేయ-2 మూవీ ఓవరాల్‌గా రూ.60 కోట్లకు పైగా షేర్ వసూళ్లు సాధించింది. అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీకి కూడా తొలిరోజే పాజిటివ్ రెస్పాన్స్ రావడం, తెలుగు రాష్ట్రాలలో మెగాస్టార్‌కు బీభత్సమైన అభిమానులు ఉండటంతో ఈ సినిమా ఈజీగా రూ.100 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అయితే తొలి వారానికి ఈ సినిమా వసూళ్లు విపరీతంగా డ్రాప్ అయ్యాయి. రెండో వారంలోనూ అంతంత మాత్రంగానే వసూళ్లు వచ్చాయి. ఇప్పటివరకు గాడ్ ఫాదర్ మూవీ రూ.58 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. కార్తీకేయ-2 వసూళ్లను కూడా దాటకపోవడంతో మెగాస్టార్ స్టామినాపై పలువురు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
గాడ్ ఫాదర్ మూవీకి మోహన్‌రాజా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించారు. ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ 15 రోజుల వసూళ్లు చూసుకుంటే నైజాంలో రూ.12.24 కోట్లు, సీడెడ్‌లో రూ.9.5 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.5.88 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.3.84 కోట్లు, పశ్చిమగోదావరిలో రూ.2.43 కోట్లు, గుంటూరులో రూ.4.03 కోట్లు, కృష్ణాలో రూ.2.86 కోట్లు, నెల్లూరులో రూ.2.11 కోట్ల షేర్ వసూళ్లను దక్కించుకుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే మరో రూ.17 కోట్ల వరకు రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఏపీ, తెలంగాణలో 16 రోజుల్లో రూ. 43.01 కోట్లు రాబట్టిన గాడ్ ఫాదర్ మూవీ కర్నాటకలో రూ. 4.71 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 5.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.17 కోట్లు వసూలు చేసింది.