
ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలను కాంతార మూవీ షేక్ చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రికార్డుస్థాయిలో వసూళ్లను కొల్లగొడుతోంది. కేజీఎఫ్ తర్వాత ఆ స్థాయిలో దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్న కన్నడ మూవీగా కాంతార నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజైన ఈ చిత్రం అక్కడ సంచలన విజయం సాధించింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడమే కాకుండా ఈ సినిమాలో తన విశ్వరూపం ప్రదర్శించాడు. ముఖ్యంగా చివరి 15 నిమిషాల్లో రిషబ్ శెట్టి నటనకు ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు. కాంతార మూవీ కన్నడలో అత్యధిక మంది వీక్షించిన సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు అన్ని భాషల ప్రేక్షకుల నుంచి భారీ డిమాండ్ ఏర్పడటంతో పలు భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు.
కాంతార మూవీని తెలుగులో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఆధ్వర్యంలోని గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదల చేసింది. కేవలం రూ.2 కోట్ల టార్గెట్‌తో విడుదల చేసిన ఈ మూవీ రెండు వారాలలో అనూహ్యంగా రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లను వసూలు చేసి ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అటు కన్నడలోనూ ఈ మూవీ రూ.16 కోట్ల బడ్జెట్‌తో హోంబలే ఫిలింస్ వారు నిర్మించారు. అయితే ఓవరాల్‌గా రూ.200 కోట్ల వసూళ్లను సాధించి ఔరా అనిపించింది. విడుదలైన ప్రతి భాషలో భారీ వసూళ్ళను సాధిస్తూ ఈ మూవీ డబుల్ బ్లాక్‌బస్టర్ నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ చిక్కుల్లో పడింది. ముఖ్యంగా వరాహ రూపం పాట బాణీ కాపీ అని విమర్శలు వచ్చాయి. తమ నవసర మూవీకి కాపీ అని ‘తైక్కుడం బ్రిడ్జ్’ మ్యూజిక్ బ్యాండ్ ఆరోపించింది. అంతే కాకుండా కోర్టులో కేసు కూడా వేసింది. దీంతో కేరళలోని థియేటర్లలో, ఇతర స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో వరాహ రూపం పాటను ప్లే చేయకూడదని కేరళ కోజికోడ్ సెషన్స్ కోర్టు కాంతార చిత్ర దర్శక నిర్మాతలను ఆదేశించింది.
ప్రకృతి, మానవాళికి మధ్య ఉండాల్సిన సంబంధాలను తెలియజేస్తూ తెరకెక్కిన కాంతార సినిమాలో వరాహ రూపం పాటకు ప్రేక్షకుల నుంచి విశేషణ ఆదరణ లభించింది. భూతకోల ఆడే వ్యక్తిని పంజుర్లి దేవత ఆవహించిన సమయంలో వచ్చే ఈ పాట ప్రేక్షకుల్ని సినిమాలో లీనమయ్యేలా చేస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రిషబ్ నటనకు ఈ పాట తోడవడంతో ఆ సన్నివేశాలు మరోస్థాయికి వెళ్లాయి. అటు ఈ డాది బ్లాక్‌బస్టర్ చిత్రాలలో ఒకటైన కార్తీకేయ-2 రికార్డును కాంతార చిత్రం బ్రేక్ చేసింది. కార్తీకేయ-2 చిత్రం హిందీలో రూ.31.05 కోట్లు కలెక్ట్ చేయగా.. తాజాగా కాంతార రూ.31.70 కోట్లు వసూళ్ చేసి కార్తికేయ-2 రికార్డును బ్రేక్ చేసింది. ఇదే జోష్ కంటిన్యూ చేస్తే కాంతార మరిన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగులో కాంతార చిత్రానికి మూడో వారం థియేటర్ కౌంట్ విపరీతంగా పెరిగింది. రెండో వారానికి దాదాపు రెండింతలు థియేటర్‌ల సంఖ్య పెరిగింది. తొలి వారం 305 థియేటర్లు, రెండో వారం 220 థియేటర్లు మాత్రమే ఈ మూవీకి అందుబాటులో ఉన్నాయి. కానీ మూడో వారం 555 థియేటర్లకు పైగా కాంతార మూవీ ప్రదర్శింపబడుతోంది.