
టాలీవుడ్‌లో హాస్యనటులు ఎంత మంది ఉన్నా వారిలో కొంతమందే అభిమానుల మనసులో సుస్థిర సానం సంపాదించుకుంటారు. అలాంటి వారిలో ఏవీఎస్ కూడా ఉంటారు. ఏవీఎస్ పూర్తి పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. అందరూ ముద్దుగా ఏవీఎస్ అని పిలుచుకుంటారు. ఆయన హాస్య నటుడిగానే కాదు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా, దర్శకుడిగా తనకంటూ బలంగా ఓ ముద్ర వేశారు. ప్రస్తుతం ఏవీఎస్ మన మధ్య లేకపోయినా ఆయన నటించిన సినిమాలు బుల్లితెరపై ప్రసారమవుతూ ఎప్పుడూ గుర్తుకుతెస్తూనే ఉంటాయి. ఏవీఎస్ 1957లో జనవరి 2న గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. కాలేజీలో చదివే సమయంలోనే నాటకాలు ప్రదర్శిస్తూ తనలోని కళను బయటపెట్టారు. 1993లో రాజేంద్రప్రసాద్ నటించిన మిస్టర్ పెళ్లాం సినిమాతో టాలీవుడ్‌కు ఏవీఎస్ పరిచయం అయ్యారు. బాపు దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ఏవీఎస్ కామెడీ స్టార్‌గా ఎదిగిపోయారు.
మిస్టర్ పెళ్లాం సినిమాలో ఏవీఎస్ మాట్లాడే నత్తి మాటలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమాకు ఏవీఎస్‌కు ఉత్తమ నంది అవార్డు కూడా దక్కింది. అనంతరం మాయలోడు, శుభలగ్నం, ఘటోత్కచుడు వంటి సినిమాలతో వరుస హిట్లను ఏవీఎస్ అందుకున్నారు. ఇలా సాగిన ఆయన నటప్రస్థానంలో 500 చిత్రాల్లో నటించారు. వీటిలో దాదాపు 450 చిత్రాల్లో హాస్యనటుడిగానే కనిపించారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ ఏవీఎస్ మంచి మార్కులు సంపాదించుకున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సూపర్ హీరోస్ వంటి సినిమాతో పాటు తరుణ్ నటించిన అంకుల్, ఓరి నీ ప్రేమ బంగారం కానూ, రూమ్ మేట్స్, కోతిమూక వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. సినిమాల్లోనే కాకుండా ఏవీఎస్‌కు రాజకీయ నేపథ్యం కూడా ఉంది. చంద్రబాబు హయాంలో టీడీపీలో ఏవీఎస్ పనిచేశారు. ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున ప్రచారం కూడా పాల్గొనేవారు.
ఏవీఎస్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే 1980లో ఆశా కిరణ్మయి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె ప్రశాంతి కాగా కుమారుడు ప్రదీప్. ఏవీఎస్ చనిపోయిన తర్వాత కుమారుడు ప్రదీప్ ఇండస్ట్రీలో వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. తన తండ్రి ఏవీఎస్ వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రదీప్ తనను తాను తీర్చిదిద్దుకున్నాడు. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ చేసిన ప్రదీప్ కొన్నాళ్ళు ఎయిర్‌టెల్ కలెక్షన్ ఏజెన్సీ నిర్వహించాడు. సొంతంగా యాడ్ ఏజెన్సీ సైతం నడిపిన ప్రదీప్ పలు పేరొందిన సంస్థలకు యాడ్ ఫిల్మ్స్ చేసి తన ప్రతిభను ఘనంగా చాటుకున్నాడు. కరోనా టైమ్ లోనూ తనలోని క్రియేటివిటీకి పదును పెట్టి యాక్టివ్ స్టూడియోస్ పేరిట యు ట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అన్నాచెల్లెళ్లయిన తన ఇద్దరు చిన్నారులతో వందకు పైగా ఎపిసోడ్స్ చేసి మెప్పించాడు. ఆ తర్వాత వైదేహి, భళా చోర భళా అనే షార్ట్ ఫిలింస్ తెరకెక్కించాడు. ఇవి త్వరలో విడుదల కానున్నాయి. గతంలో షార్ట్ ఫిలింస్‌లో నటించిన ప్రదీప్ ఇకపై సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏ పాత్రలో అయినా నటించి ప్రేక్షకులను మెప్పించాలని ప్రదీప్ విశ్వప్రయత్నాలు ప్రారంభించాడు.