
ఆన్‌లైన్ సిస్టమ్ అందుబాటులోకి రావడంతో సినిమాల ముఖచిత్రం మారిపోయింది. గతంలో సినిమా చూడాలంటే గంట ముందుగానే థియేటర్‌కు వెళ్లి లైన్‌లో నిలబడి టిక్కెట్ కొనుగోలు చేసేవాళ్లం. ఒకవేళ టికెట్లు దొరక్కపోతే 50 రూపాయలు ఎక్కువ పెట్టి అయినా బ్లాక్‌లో టిక్కెట్ కొనుగోలు చేసి సినిమా చూసేవాళ్లం. కానీ ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే టిక్కెట్ కోనుగోలు చేసి సినిమాకు వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తాజాగా ఓ సినిమాకు బ్లాక్‌లో టిక్కెట్లు అమ్ముతున్నారు. టిక్కెట్లు అక్రమంగా అమ్ముతూ దొరికిపోయింది ఎవరో కాదు కమెడియన్ సప్తగిరి. జూలై 1న విడుదలవుతున్న పక్కా కమర్షియల్ సినిమాకు సప్తగిరి బ్లాక్‌లో టిక్కెట్లు అమ్మడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదంతా మూవీ ప్రమోషన్‌లో భాగమని వీడియో చూస్తే అర్ధమవుతోంది. ఈ మేరకు కమెడియన్ సప్తగిరి, దర్శకుడు మారుతిలతో సినిమా యూనిట్ ప్రమోషన్ కోసం ఓ వీడియోను రూపొందించారు.
గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటించిన పక్కా కమర్షియల్ మూవీ ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇటీవల పలు సినిమాలకు టిక్కెట్ రేట్లు భారీగా ఉన్న నేపథ్యంలో పక్కా కమర్షియల్ మూవీకి టికెట్ ధరలపై ప్రేక్షకుల్లో సందేహం నెలకొంది. దీంతో ఈ సినిమా టికెట్ల ధరలపై క్లారిటీ ఇచ్చేందుకు చిత్ర బృందం కొత్తగా ఇలా ప్లాన్ చేసింది. గీతా ఆర్ట్స్ తమ యూట్యూబ్ చానల్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో సప్తగిరి బ్లాక్ టికెట్లు అమ్ముతూ దర్శకుడికి కనిపిస్తాడు. అప్పుడు మారుతి సప్తగిరిని ఏంటి బ్లాక్‌లో టికెట్లను అమ్ముతున్నావా అని అడగగా సినిమాల్లోకి రాకముందే చిరంజీవి సినిమాలకు ఇదే పని చేసేవాడిని అని సప్తగిరి చెప్పాడు. ఇప్పుడు ఒక టికెట్ ఎంతకు అమ్ముతున్నావని అడగ్గా రూ.150 అని సప్తగిరి సమాధానం చెబుతాడు. దీనికి డైరెక్టర్ మారుతి కౌంటర్‌లో కూడా ఇదే ధరకు ఇస్తున్నారు కదా అంటాడు. అది విని సప్తగిరి పాత ధరలకే సినిమాను ప్రదర్శిస్తున్నారా అని అడుగుతాడు. ఈ చిత్రాన్ని నాన్ కమర్షియల్ ధరలకే అందుబాటులో ఉంచుతున్నట్టు నిర్మాత బన్నీవాసు మూవీ ప్రమోషన్లలో చెబుతున్నాడు కదా అది వినలేదా అని మారుతి అడగ్గా అవునా సార్ అంటూ సప్తగిరి ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు.
కాగా పక్కా కమర్షియల్ మూవీని మారుతి డైరెక్ట్ చేశాడు. సంతోష్ శోభన్‌తో తెరకెక్కించిన మంచి రోజులొచ్చాయి సినిమా తర్వాత మారుతి దర్శకత్వం వహించిన సినిమా ఇదే. మధ్యలో ఆయన త్రీరోజెస్ అంటూ ఆహా ఓటీటీ కోసం వెబ్ సిరీస్‌ను రూపొందించాడు. ఈ సినిమాను కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. పక్కా కమర్షియల్ సినిమాకు సెన్సార్ వాళ్లు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. సినిమా నిడివి 2 గంటల 32 నిమిషాలకు లాక్ చేశారు. ఈ సినిమాలో తండ్రి న్యాయానికి కట్టుబడిన న్యాయవాది పాత్రలో గోపీచంద్ పక్కా కమర్షియల్ లాయర్‌గా కనిపించనున్నాడు. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఈ మూవీ ఓటీటీ హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్‌తో పాటు తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా దక్కించుకున్నాయి. ఈ రెండు స్త్రీమింగ్స్ సంస్థలతో ఓటిటి డీల్‌ను మేకర్స్ లాక్ చేసుకున్నారు. ఈ సినిమా విడుదలైన ఐదు వారాలకు ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది.