
ప్రముఖ టాలీవుడ్ పాపులర్ కమెడియన్ అలీ సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ రాణిస్తున్నాడు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆయనకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించింది. అంతేకాకుండా బుల్లితెరపై అలీతో సరదాగా షోతోనూ అలీ అలరిస్తున్నాడు. తాజాగా అలీ కుమార్తె ఫాతిమా వివాహం ఘనంగా జరిగింది. గత ఆదివారం హైదరాబాద్ నగరంలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సినిమా రంగం నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, వ్యాపార ప్రముఖులు హాజరై ఫాతిమా దంపతులను ఆశీర్వదించారు. ఆ తర్వాత గుంటూరులో రిసెప్షన్ కార్యక్రమం నిర్వహించగా ఏపీ సీఎం జగన్ కూడా హాజరయ్యారు. అయితే అలీ అల్లుడి బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకోవడం కోసం పలువురు ఆరాలు తీశారు. ఇంతకీ అలీ అల్లుడు ఎవరు.. ఏం చేస్తుంటాడు.. అతడు ఎంత కట్నం తీసుకుంటున్నాడు వంటి అంశాలను తెలుసుకోవడం కోసం అతిథులతో పాటు నెటిజన్‌లు కూడా ప్రయత్నించారు.
అలీ అల్లుడి పేరు షెహయాజ్. అతడు డాక్టరేగా పనిచేస్తున్నాడు. జమీలా బాబీ, జలానీ భాయ్ దంపతుల కుమారుడు షెహయాజ్. అతనికి అన్న, సోదరి ఉన్నారు. వీళ్లిద్దరితో పాటు వరుడి వదిన కూడా డాక్టరే కావడం గమనించాల్సిన విషయం. వీరంతా గుంటూరుకు చెందిన వారు కాగా ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు. అతని కుటుంబ సభ్యులు అందరూ ఉన్నత విద్యావంతులే. అలీ కూతురు ఫాతిమా కూడా డాక్టర్ చదివింది. ఇటీవల ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అలీ కుటుంబంలో ఫాతిమా మొట్టమొదటి డాక్టర్‌గా నిలిచింది. ఫాతిమా డాక్టర్ చదివేసరికి అల్లుడు కూడా డాక్టరే కావాలని అలీ ఏరి కోరి షెహయాజ్‌ను ఎంపిక చేసుకున్నాడు. షెహయాజ్‌కు ఆస్తి కూడా భారీగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి మంచి ఆస్తి పరుడు, గుణవంతుడిని అలీ తన అల్లుడిగా చేసుకున్నాడని పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు కొనియాడుతున్నారు. అయితే అలీకి ఎంతో సన్నిహితుడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అలీ కుమార్తె వివాహ వేడుకకు హాజరుకాకపోవడం పలువురిని నిరుత్సాహానికి గురిచేసింది.
అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత కావడం.. అలీ ఆయన వ్యతిరేకించే వైసీపీలో ఉండటం వల్లే పవన్ ఈ వేడుకకు హాజరుకాలేదని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అలీ ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాడు. తన కుమార్తె వివాహం బాగా జరిగిందని, వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేశాడు. తన కుమార్తె జన్మదినానికి చిరంజీవి వచ్చారని, మళ్లీ ఆమె వివాహానికి హాజరుకావడం ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. తన కుమార్తె పెళ్లి పనుల్లో బిజీగా ఉండటంవల్ల బాధ్యతలు స్వీకరించలేదని, ఈనెల 10 నుంచి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పాడు. పవన్ కల్యాణ్ తన కుమార్తె వివాహానికి కచ్చితంగా హాజరయ్యేవారని, కానీ దురదృష్టవశాత్తూ విమానం మిస్ అయ్యిందన్నారు. తర్వాత ఈ విషయాన్ని ఫోన్ చేసి తెలిపారని, మళ్లీ కలుస్తానన్నారని చెప్పారు. పవన్ హాజరయ్యేందుకు వీలుగా ఆయన సెక్యూరిటీ వచ్చి ఒకసారి ఇక్కడి ఏర్పాట్లు చూసుకున్నారని వివరించారు. తాను రాలేకపోయినందుకు ఫోన్ చేశారని, తర్వాత అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ ఇంటికి వచ్చిన సమయంలో ఒకసారి ఫోన్ చేస్తే వస్తానని పవన్ చెప్పినట్లు అలీ స్పష్టం చేశాడు. అటు తాను ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవితో పాటు సినిమాలు, షోలు కూడా చేస్తూనే ఉంటానని చెప్పాడు.