
టాలీవుడ్‌లో అగ్రహీరోల ప్రస్తావన వస్తే అందులో సూపర్‌స్టార్ కృష్ణ కూడా ఉంటారు. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ తర్వాత తరంలో కృష్ణ అగ్రహీరోగా చలామణి అయ్యారు. శోభన్‌బాబు, కృష్ణంరాజు, చంద్రమోహన్ లాంటి హీరోలతో పోటీ పడుతూ సినిమాల మీద సినిమాల్లో నటించారు. అందుకే సూపర్‌స్టార్ కృష్ణను ఎవర్ గ్రీన్ హీరో అని పిలుస్తుంటారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి. 1943 మే 31వ ఏదైనా ఆంధ్రప్రదేశ్ లోని బుర్రిపాలెం అనే గ్రామంలో జన్మించారు. 20 ఏళ్ల వయసులోనే ఆయన సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో తెరకెక్కిన తేనెమనసులు సినిమా ద్వారా టాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. తెలుగులో దాదాపు 350కి పైగా సినిమాల్లో నటించడమే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగానూ కృష్ణ తన టాలెంట్ చూపించారు. ఎప్పుడు చూసినా షూటింగులతో బిజీగా కనిపించేవాళ్లు.
ఇప్పటి హీరోలు అయితే ఏడాదికి ఒక సినిమా కూడా చేయడం లేదు. అల్లు అర్జున్, మహేష్‌బాబు, ఎన్టీఆర్ వంటి హీరోలు అయితే రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు. కానీ అప్పట్లో హీరో కృష్ణ ఏడాదిలో 18 సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. సాధారణంగా నెలకు ఓ సినిమా చేసినా ఏడాదికి 12 సినిమాలే అవుతాయి. కానీ కృష్ణ ఏడాదిలో 18 సినిమాలు చేశారంటే ఆయన కమిట్‌మెంట్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆరోజుల్లో అవుట్ డోర్ షూటింగులు ఎక్కువగా ఉండేవి కావు. దాదాపుగా స్టూడియోల్లోనే సెట్లు వేసి షూటింగ్ చేసేవాళ్లు. అందుకే హీరోలు షిఫ్టుల ప్రకారం పనిచేసి పారితోషికం తీసుకునేవాళ్లు. 1980 కాలంలో మద్రాసులో వాహినీ, జెమినీ స్టూడియోల్లోనే ఎక్కువగా సినిమా షూటింగులు జరిగేవి. 1972లో ఒక్క ఏడాదిలో కృష్ణ నటించిన 18 సినిమాలు విడుదలయ్యాయి. మొనగాడొస్తున్నాడు జాగ్రత్త, రాజమహల్, అంతా మనమంచికే, మా ఊరి మొనగాళ్ళు, గూడుపుఠాని, హంతకులు దేవాంతకులు, కోడలు పిల్ల, మేనకోడలు, భలే మోసగాడు, పండంటి కాపురం, నిజం నిరూపిస్తా, ఇన్‌స్పెక్టర్ భార్య, అబ్బాయిగారు అమ్మాయిగారు, మా ఇంటి వెలుగు, ప్రజా నాయకుడు, మరపురాని తల్లి, ఇల్లు ఇల్లాలు, కత్తుల రత్తయ్య వంటి సినిమాలు ఒకే ఏడాది వరుసపెట్టి విడుదలయ్యాయి.
ఒక హీరో ఒక ఏడాదిలో 18 సినిమాలు చేయడం అంటే ఆషామాషీ కాదు. ఈ సినిమాల్లో దాదాపుగా 80 శాతం సినిమాలు హిట్ అయ్యాయి. ప్రజలు ఏమాత్రం బోరు ఫీలవ్వకుండా కృష్ణ సినిమాలను చూసేవాళ్లు. ఇప్పటివరకు ఈ రికార్డును ఏ హీరో కూడా అందుకోలేదు. ఇప్పుడు నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే భవిష్యత్‌లో కూడా ఈ రికార్డును బ్రేక్ చేయలేరు. ఈ రికార్డు కేవలం సూపర్ స్టార్ కృష్ణకు మాత్రమే చరిత్రలో లిఖించబడి ఉంటుంది. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు. కానీ అప్పట్లోనే సూపర్ స్టార్ కృష్ణ వరల్డ్ సినిమా చేశారు. మోసగాళ్లకు మోసగాడు అనే సినిమా కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, మలయాళం, బెంగాలీ, కన్నడలో విడుదలవ్వడమే కాకుండా హాలీవుడ్‌లో కూడా విడుదలైంది. అటు స్పానిష్, రష్యన్ భాషల్లో కూడా ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేశారు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక భాషల్లో విడుదలైన ఇండియన్ సినిమాలు కూడా మోసగాళ్లకు మోసగాడు సంచలనం సృష్టించింది.