
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం తొలిరోజే మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో అక్కినేని అమల శర్వానంద్ తల్లి పాత్రలో నటించారు. మదర్ సెంటిమెంటుతో సాగే ఈ సినిమా ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఒకే ఒక జీవితం శర్వానంద్ కెరీర్‌లో 30వ సినిమా. నూతన దర్శకుడు శ్రీ కార్తిక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.50 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. అయితే రెండు వారాల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్‌కు చేరుకుని క్లీన్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో శర్వాకు జోడీగా రీతూవర్మ హీరోయిన్‌గా నటించింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఃకాగా ఈ వారం రెండు తమిళ సినిమాలు భారీ స్థాయిలో విడుదలవుతున్నాయి. ధనుష్ నటించిన నేనే వస్తున్నా సినిమాతో పాటు మణిరత్నం మల్టీస్టారర్ మూవీ పొన్నియన్ సెల్వన్ పార్టు-1 ఈ వారం విడుదలకు సిద్ధమయ్యాయి. వచ్చే వారంలో తెలుగులోనే మూడు సినిమాలు విడుదలకు క్యూ కట్టాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాతో పాటు నాగార్జున నటించిన ది ఘోస్ట్, బెల్లంకొండ గణేష్ నటించిన స్వాతి ముత్యం చిత్రాలు అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదల కానున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల ఒకే ఒక జీవితం వసూళ్లు నెమ్మదించాయి. దీంతో ఈ వారం ఈ మూవీ కలెక్షన్స్ దాదాపుగా క్లోజ్ కానున్నాయి. ఫుల్ రన్‌లో ఈ మూవీ రూ.11 కోట్ల షేర్ రాబట్టి నిర్మాతకు రూ.3 కోట్ల లాభాన్ని అందించింది. తొలిరోజు తెలుగు రాష్ట్రాలలో రూ.75 లక్షలు మాత్రమే రాబట్టిన ఈ మూవీ పాజిటివ్ టాక్ కారణంగా రెండో రోజు రూ.1.10 కోట్లు వసూలు చేసింది. మూడో రోజు ఈ వసూళ్లు మరింత పెరిగి రూ.1.37 కోట్లకు చేరాయి. దీంతో వీకెండ్‌లో రూ.3 కోట్ల వసూళ్లను ఈ మూవీ రాబట్టింది.
అటు మూడు వారాల వసూళ్లను చూసుకుంటే నైజాంలో రూ.3.5 కోట్లు, సీడెడ్‌లో రూ.60 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.80 లక్షలు సహా ఏపీ, తెలంగాణలో రూ.7 కోట్ల వసూళ్లను ఒకే ఒక జీవితం సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలలో కూడా రూ.కోటి కలెక్ట్ చేసింది. ఓవర్సీస్‌లోనూ రూ.2.5 కోట్లకు పైగా రాబట్టింది. తమిళంలో రూ.1.5 కోటి వసూలు చేసింది. తమిళంలో కణం పేరుతో ఈ సినిమాను విడుదల చేశారు. అటు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను సుమారు 15 కోట్లకు సోనీ లీవ్ కైవసం చేసుకుంది. అక్టోబర్ రెండో వారంలో ఒకే ఓక జీవితం సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నారు.