
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. దీంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. గంపగుత్తగా సినిమాలు ఒప్పుకోకుండా కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. యువసుధ ఆర్ట్స్ బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను ఫక్తు కమర్షియల్ మూవీగా తెరకెక్కించబోతున్నాడని ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది.
అయితే ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ మాటను దర్శకుడు కొరటాల శివ లెక్కచేయడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. హీరోయిన్‌ల ఎంపిక అంటూ అతడు కాలయాపన చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. సాయిపల్లవి, రష్మిక లాంటి హీరోయిన్‌లను ఎంపిక చేయాలని ఎన్టీఆర్ సూచించినా కొరటాల శివ వాటిని పెడచెవిన పెడుతున్నాడని.. పాన్ ఇండియా సినిమా కాబట్టి బాలీవుడ్ హీరోయిన్‌లను తీసుకునేందుకు అతడు ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది. అయితే కేవలం హీరోయిన్‌ల కోసం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను పదే పదే వాయిదా వేస్తున్నాడని.. దీంతో ఎన్టీఆర్ ఆగ్రహంగా ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ అసహనంతో ఉండటంతో వేరే కథలు కూడా వింటున్నాడని రూమర్లు వస్తున్నాయి. తొలుత ఈ మూవీలో ఆలియా భట్ హీరోయిన్‌గా చేస్తుందని టాక్ నడిచింది. అయితే ఆమె ప్రస్తుతం తన ప్రియుడిని పెళ్లి చేసుకుని కాస్తా బిజీ అయ్యింది. దీనికి తోడు గతంలో ఒప్పుకున్న పలు ప్రాజెక్టుల వల్ల ఆలియాభట్ ఎన్టీఆర్ సినిమా చేయడం లేదని తెలుస్తోంది.
ఎన్టీఆర్ కొత్త సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందోనని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా అంత త్వరగా సెట్స్ పైకి వెళ్లకపోవచ్చని అంటున్నారు. మిర్చి సినిమాతో మెగా ఫోన్ పట్టిన కొరటాల శివ ఆ తర్వాత వరుసగా శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు. ఈ నాలుగు సినిమాలు ఒకదానిని మించి మరొకటి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనం సృష్టించాయి. అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో తీసిన ఆచార్య సినిమా కొంచెం నిరాశపరిచింది. దీంతో ఎన్టీఆర్‌తో తెరకెక్కించే సినిమాను ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని కొరటాల శివ పట్టుదలతో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఓ టీజర్ విడుదల చేయగా అందులో ఎన్టీఆర్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులలో హీరో ఎలివేషన్ మీద, సినిమాలో కంటెంట్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ పాన్ ఇండియా సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు.