
టాలీవుడ్ హీరోయిన్ సదా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జయం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సదా.. తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో వరుస ఆఫర్లను చేజిక్కించుకుంది. ఎన్టీఆర్‌తో నాగ, బాలయ్యతో వీరభద్ర, మంచు మనోజ్‌తో దొంగ-దొంగది, ఉదయ్ కిరణ్‌తో ఔనన్నా-కాదన్నా, సిద్ధార్థ్‌తో చుక్కలో చంద్రుడు వంటి సినిమాలను చేసింది. అయితే జయం తరహాలో హిట్ మాత్రం లభించలేదు. దీంతో ఇతర ఇండస్ట్రీలకు తరలివెళ్లింది. అక్కడ కూడా బ్రేక్ రాకపోవడంతో కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ప్రస్తుతం బుల్లితెరపై పలు రియాల్టీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఇటీవల జీ5లో క్రేజీ వరల్డ్ అనే వెబ్ సిరీస్‌లోనూ నటించింది. ఈ సందర్భంగా హీరో ఉదయ్ కిరణ్ మృతిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉదయ్ కిరణ్ వంటి ఓ నటుడిని కోల్పోవడం చాలా దురదృష్టకరమని సదా అభిప్రాయపడింది. అతడితో ఔనన్నా కాదన్నా వంటి సినిమాలో నటించడం గొప్ప అనుభూతిని మిగిల్చిందని సదా వివరించింది.
అటు ఉదయ్ కిరణ్ కెరీర్‌లో చాలా మంచి హిట్లు వచ్చాయని.. అతడి కెరీర్‌లో ఎక్కడ తప్పు జరిగిందో తనకు తెలియదని సదా వ్యాఖ్యానించింది. ఉదయ్ కిరణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో కూడా తనకు తెలియదని.. ఏదేమైనా ఉదయ్ కిరణ్ చేసింది చాలా పెద్ద తప్పు.. అతడిని తాను సమర్దించను అని పేర్కొంది. మనం ప్లాన్ చేసుకున్నట్లు కెరీర్ లేకపోయినంత మాత్రాన చావు అనేది సమస్యకు పరిష్కారమే కాదని అభిప్రాయపడింది. జీవితం కెరీర్ కంటే గొప్పదని.. జీవితంలో ఇంకా సాధించాల్సినవి చాలానే ఉంటాయని తెలిపింది. సినిమాలు ఫ్లాప్ అయినంత మాత్రాన నటీనటులు డిప్రెషన్‌కు గురికాకూడదని సదా సూచించింది. సినిమా ఆడడం.. ఆడకపోవడం మన చేతుల్లో ఉండదని.. నటులుగా బెస్ట్ ఇవ్వడం మాత్రమే తమ చేతుల్లో ఉంటుందని.. మిగతాది ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుందని సదా వెల్లడించింది. ప్రేక్షకులు మనల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అన్నది పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుందని.. దానిని అందరూ అంగీకరించాలని సదా చెప్పింది.
కాగా హలో వరల్డ్ వెబ్ సిరీస్‌లో సదా అద్భుతంగా నటించింది. లెర్నింగ్ మేనేజర్‌గా ముఖ్యపాత్రను పోషించింది. ఇప్పుడున్న రోజుల్లో సాఫ్ట్ వేర్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న వాళ్లు ఏ రకంగా ఉంటారో ఈ వెబ్ సిరీస్‌లో కళ్లకు కట్టినట్లు చూపించారు. దీంతో ఈ వెబ్ సిరీస్ అందరి నోళ్లలోనూ నానుతోంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించగా ఉదయ్ కిరణ్‌తో సాన్నిహిత్యం గురించి సదా గుర్తుచేసుకుంది. ఇప్పటివరకు ఉదయ్ కిరణ్‌తో చాలా మంది నటీమణులు పనిచేసినా ఎప్పుడూ నోరు విప్పి స్సందించలేదు. కానీ తొలిసారిగా సదా అతడితో ప్రయాణం గురించి వివరించింది. జయం సినిమాను ఆదరించిన ప్రేక్షకులు తాను చేసిన ఔనన్నా కాదన్నా సినిమాను ఆదరించలేదు. అంత మాత్రానికి ఒత్తిడి అంతా తీసుకుని డ్రిపెషన్‌లోకి వెళ్లిపోతే ఎలా అని ప్రశ్నించింది. సాధారణంగా సలహాలు ఇచ్చేవారు ఏదేదో చెబుతుంటారని.. ఉదాహరణకు తాను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసినప్పుడు ప్లీజ్ పెళ్లి చేసుకోండి.. పిల్లల్ని కనండి అని చాలా మంది సలహాలిచ్చారని సదా తెలిపింది. మన జీవితం గురించి అలాంటి కామెంట్స్ చేసే హక్కుని వారికెవరిచ్చారని… అలాంటి వారందరికీ తానెందుకు సమాధానం చెప్పాలని ప్రశ్నించింది. ఇప్పుడు పది పెళ్లిళ్లు అవుతుంటే అందులో ఐదు జంటలైనా పెళ్లి తర్వాత హ్యాపీగా ఉన్నారా అని నిలదీసింది. తాను పెళ్లి చేసుకునే ధనవంతుడు కాకపోయినా ఫర్వాలేదని.. కానీ ఒకరిపై ఆధారపడకుండా ఉంటే చాలని.. తన సంపాదనపైనో, మరొకరి సంపాదన పైనో ఆధారపడకూడదనేది తన అభిప్రాయమని వివరించింది.