
ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన చిత్రం సినిమాతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన ఉదయ్ కిరణ్ తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఆ రోజుల్లోనే రూ.50 లక్షలతో తెరకెక్కి రూ.6.5 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతో తేజ, ఉదయ్ కిరణ్, రీమాసేన్ ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. అనంతరం ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అరంగేట్రంలోనే హ్యాట్రిక్ అందుకున్న హీరోగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. దీంతో ఉదయ్ కిరణ్ తనకెంతో ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు కూడా అందుకున్నాడు. ఏకంగా ఇంద్ర సినిమా 100 రోజుల వేడుకకు స్పెషల్ గెస్టుగా హాజరయ్యాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఉదయ్ కిరణ్ జీవితం మధ్యలోనే ఆగిపోయింది.
తన కెరీర్ ఫుల్ స్సీడులో ఉన్నప్పుడు ఉదయ్ ఓ బ్లాక్ బస్టర్ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. ఆ సినిమానే అతడు సినిమా. సూపర్ స్టార్ మహేష్‌బాబు నటించిన అతడు సినిమాలో తొలుత హీరోగా ఉదయ్ కిరణ్ నటించాల్సి ఉంది. నిర్మాత మురళీమోహన్ తన జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానరులో ఉదయ్ హీరోగా ఓ సినిమా తీయాలని డిసైడ్ అయ్యారు. దర్శకుడు త్రివిక్రమ్ చెప్పిన స్టోరీకి ఉదయ్ సూట్ అవుతాడని భావించారు. అయితే అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితతో ఉదయ్ కిరణ్‌కు ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ అవ్వడం, చిరంజీవి, ఉదయ్ కిరణ్ డేట్లను చూసే బాధ్యత అల్లు అరవింద్ చేతిలో పెట్టడంతో.. ఆయన అప్పటికే పెద్ద బ్యానర్లకు ఉదయ్ కిరణ్ డేట్లు ఇచ్చేశాడు. ఇదే విషయాన్ని మురళీమోహన్‌కు ఉదయ్ కిరణ్ చెప్పడంతో అప్పుడు సూపర్ స్టార్ కృష్ణతో తనకున్న స్నేహంతో మహేష్‌బాబు దగ్గరకు వెళ్లి డేట్లు తెచ్చుకున్నారు. అలా ఉదయ్ కిరణ్ చేయాల్సిన అతడు సినిమా మహేష్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ సినిమా సంచలన విజయం సాధించింది.
అయితే ఉదయ్ కిరణ్ కాదన్న తర్వాత త్రివిక్రమ్ అతడు సినిమా స్టోరీని పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు కూడా వినిపించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. తరుణ్, రిచా జంటగా నటించిన నువ్వేకావాలి సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను రామోజీరావుతో పాటు స్రవంతి రవికిషోర్ కూడా నిర్మించారు. ఈ మూవీకి మాటలను త్రివిక్రమ్ అందించారు. దీంతో నిర్మాత స్రవంతి రవికిషోర్ త్రివిక్రమ్ దర్శకుడిగా చేసే మొదటి సినిమా తన బ్యానర్ లోనే చేయాలని అడ్వాన్స్ ఇచ్చి ఆయన్ను లాక్ చేశారు. అలా వీళ్లిద్దరి కాంబోలో నువ్వే నువ్వే సినిమాను తెరకెక్కించారు. అయితే నువ్వే నువ్వే సినిమాకు ముందే అతడు స్క్రిప్టును త్రివిక్రమ్ సిద్ధం చేసుకున్నారు. ఈ కథకు అప్పట్లో ఫామ్‌లో ఉన్న ఉదయ్ కిరణ్‌ను అనుకోగా అతడి డేట్లు దొరక్కపోవడంతో పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి కథ చెప్పగా ఆయన పది నిమిషాల పాటు కథ విని నిద్రపోయారు. అక్కడి నుంచి కామ్‌గా వెళ్ళిపోయిన త్రివిక్రమ్ నాని సినిమా షూటింగ్‌లో ఉన్న మహేష్‌బాబును కలిసి కథని వినిపించారు.. సింగిల్ సిట్టింగ్‌లోనే ఈ కథకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ తతంగం అంతా 2001లో జరగగా అతడు మూవీ 2005లో విడుదలైంది.