
టాలీవుడ్‌లో టాలెంటెడ్ దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఆర్య సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆయన తొలి సినిమాతోనే ఘన విజయాన్ని అందుకున్నాడు. తర్వాత జగడం, ఆర్య 2, 100 పర్సెంట్ లవ్, వన్ నేనొక్కడినే, రంగస్థలం, పుష్ప సినిమాలతో స్టార్ దర్శకుడిగా మారిపోయాడు. పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో పుష్ప సినిమాకు సీక్వెల్‌గా నిర్మించనున్న పుష్ప ది రూల్ కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిస్తే సుకుమార్ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప 2 స్క్రిప్ట్‌లో మార్పులు చేసి మరింత భారీగా తెరకెక్కించాలని సుకుమార్ భావిస్తున్నాడట. ఈ మూవీ బడ్జెట్ కూడా పెంచుతున్నట్లు తెలుస్తోంది. అయితే సుకుమార్ కెరీర్‌లో లోటు కూడా ఉంది. అది ఏంటంటే ఇంతవరకు ఆయన సీనియర్ హీరోలతో సినిమాలను తీయలేదు.
అల్లు అర్జున్, రామ్, మహేష్‌బాబు, నాగచైతన్య, రామ్‌చరణ్ వంటి హీరోలతోనే సుకుమార్ సినిమాలు తీశాడు. తన ఇన్నేళ్ల కెరీర్‌లో ఒక్క సీనియర్ హీరోతో కూడా సినిమాను తెరకెక్కించలేదు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలతో సినిమాలు తీయలేదు. టాలెంట్ ఉన్న దర్శకుడితో సినిమాలు తీయాలని సీనియర్ హీరోలు కూడా అభిప్రాయపడుతున్నా.. సుకుమార్ వాళ్లకు అవకాశం అయితే ఇవ్వడం లేదు. సీనియర్ హీరోలతో సుకుమార్ సినిమాలను తీస్తే బాగుంటుందని ఆయన అభిమానులు, సీనియర్ హీరోల అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సీనియర్ హీరోలతో సినిమాలను తీస్తే తనకు కంఫర్ట్ ఉండదని చెప్పాడు. అందుకే వాళ్లతో సినిమాలు తీయడం లేదని క్లారిటీ ఇచ్చాడు. అన్‌స్టాపబుల్ షోలో కూడా సుకుమార్‌తో సినిమా తీస్తే బాగుంటుందని బాలయ్య అభిప్రాయపడగా సుకుమార్ మాత్రం తన సమాధానం దాటవేశాడు. ఒకవేళ సినిమా తీస్తే రెండు నెలల్లో సినిమా తీయాలని బాలయ్య షరతు కూడా పెట్టిన సంగతి తెలిసిందే.
మరోవైపు రాజమౌళి తరహాలో సుకుమార్ కూడా భారీ పారితోషికాన్ని అందుకుంటున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా మార్కెట్‌లో టాలీవుడ్ నిర్మాతలకు కాసుల వర్షం కురిసేలా చేయడంతో ఆ సినిమా సీక్వెల్‌కు సుకుమార్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. లేటెస్ట్ గాసిప్ ప్రకారం సుకుమార్ రూ.40 కోట్లు పారితోషికం తీసుకోబోతున్నాడని టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే రాజమౌళి తర్వాత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్న రెండో దర్శకుడిగా సుకుమార్ నిలవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. రాజమౌళి ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటూ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 విషయానికొస్తే సుకుమార్ టీం త్వరలోనే లొకేషన్ల వేట మొదలుపెట్టనుంది. బన్నీ ఈ పార్టులో డాన్ పాత్రలో కనిపించనుండగా రష్మిక అతడి భార్యగా కనిపించబోతుంది. మరి పుష్ప 2 ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందోనని మూవీ లవర్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. లొకేషన్స్ ఫైనల్ అయిన వెంటనే పుష్ప 2 సెట్స్ మీదకు వెళ్లనుంది.