
బిగ్‌బాస్ షో కారణంగా ఎంతో మంది క్రేజ్ తెచ్చుకుని సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు పొందుతున్నారు. ఈ జాబితాలో నాలుగో సీజన్ కంటెస్టెంట్ సోహైల్ కూడా ఉంటాడు. బిగ్‌బాస్ షోతో సోహైల్ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం నటుడిగా కూడా రాణిస్తున్నాడు. అంతకుముందు పలు సీరియల్స్, సినిమాలలో నటించినా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్ షోలో తన స్నేహం, కోపం, అల్లరితో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హౌస్‌లో ఉన్న సమయంలో అరియానాతో అతడి వైరం, ఫ్రెండ్ షిప్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ప్రస్తుతం వెండితెరపై హీరోగా సోహైల్‌కు అవకాశాలు వస్తున్నాయి. తాజాగా లక్కీ లక్ష్మణ్ అనే సినిమాలో నటించాడు. ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. అయితే బిగ్‌బాస్ షోకు రాకముందు సోహైల్ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించాడు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలను పంచుకున్నాడు. సోహైల్ చిన్నతనంలో మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్.
అయితే 8వ తరగతిలో ఉన్నప్పుడే చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలోని కొడితే కొట్టాలిరా పాటకు డాన్స్ చేశాడు. తాను చేసిన డ్యాన్స్ నచ్చి ఓ నేపాలీ అమ్మాయి వచ్చి సోహైల్‌తో మాట్లాడింది. దీంతో ఆ అమ్మాయిని సోహైల్ ఇష్టపడ్డాడు. ప్రేమలో పడి చదువును సంక నాకించాడు. దీంతో పరీక్షల్లో అన్ని కాపీలు కొట్టి పాస్ అయ్యాడు. డెస్ర్ వెనకాల కాపీలు రాసుకుని పరీక్షలకు వెళ్లేవాడు. అలాగే అన్ని డిగ్రీ పరీక్షలు పాస్ అయిపోయినట్లు సొహైల్ స్వయంగా వెల్లడించాడు. అలాగే తాను చాలా సున్నిత మనస్కుడిని అని వివరించాడు. తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అని.. ఆయనకు ఓపెన్ హర్ట్ సర్జరీ అయిన తర్వాత తనను ఉద్యోగం చేయమని ఇంట్లో వాళ్లు రోజూ అడుగుతుండే వాళ్లు అని చెప్పాడు. ఎప్పుడు సెటిల్ అవుతావు అని విసిగించేవాళ్లు అని వివరించాడు. కానీ తనకు సినిమాలంటే ఎంతో ఇష్టమని.. అప్పటికీ రెండు సినిమాల్లో నటించినా హీరోగా గుర్తింపు రాలేదన్నాడు. చిన్నతనంలో ఎక్కడ షూటింగ్ జరిగినా వెళ్లేవాడినని.. అయితే తాను మొదటిగా చూసిన హీరోయిన్ తమన్నా అని చెప్పాడు.
తాను ఇంటర్ చదువుతున్న సమయంలోనే కొత్త బంగారులోకం సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి తన ఫోటోలు పంపించినట్లు సోహైల్ చెప్పాడు. అలా వరుణ్ సందేశ్ నటించిన కొత్తబంగారులోకం సినిమాలో సైడ్ క్యారెక్టర్ వచ్చిందన్నాడు. అలా తన సినీ ప్రయాణం మొదలైందని తెలిపాడు. హీరోగా తన మొదటి సినిమా మ్యూజిక్ మ్యాజిక్ అని.. కానీ ఆ సినిమా హిట్ అవ్వలేదని గుర్తుచేసుకున్నాడు. ఆ సినిమాకు తన తండ్రి, స్నేహితులను తీసుకువెళ్లగా థియేటర్ వాళ్లు షో వేయలేదని.. దీంతో తాను చాలా బాధపడినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. తర్వాత సీరియల్స్‌లో కూడా నటించానని.. కానీ బిగ్‌బాస్ రియాలిటీ షో వల్ల పేరు వచ్చిందన్నాడు. సినిమాల్లోకి వెళ్లకముందు తన ఇంట్లో ఉద్యోగమంటూ ఒత్తిడి చేసేవాళ్లని సోహైల్ తెలిపాడు. ఇంట్లో వాళ్ల కారణంగా ఒకదశలో తాను డిప్రెషన్లోకి వెళ్లిపోయినట్లు ఇంటర్వ్యూలో సోహైల్ చెప్పాడు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించానని.. కానీ ఆ తర్వాత తనకు తాను సర్ది చెప్పుకున్నానని తెలిపాడు. గవర్నమెంట్ ఉద్యోగంలో చేరడానికి వెళ్లినా తన మనసు సరిగ్గా ఉండేది కాదని.. అందుకే వెనక్కి వచ్చేసినట్లు సోహైల్ వెల్లడించాడు. ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటం తనకు ఎంతో గర్వంగా ఉందన్నాడు. కానీ తాను ఇలా ఉండడానికి తన తండ్రి ఎన్నో త్యాగాలు చేశారని పేర్కొన్నాడు. వాటిని తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పుకొచ్చాడు.