
మెగా మల్టీస్టారర్ ఆచార్య అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఈ మూవీ అంచనాలను అందుకోవడంలో బోల్తా పడింది. ఇద్దరు స్టార్ హీరోలు నటించడం, కొరటాల శివ దర్శకత్వం వహించడం, పూజా హెగ్డే స్పెషల్ క్యారెక్టర్ ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమయ్యాయి. అయితే ఈ సినిమాలో కొరటాల శివ మార్క్ కనిపించలేదని మెగా అభిమానులు తొలిరోజు నుంచే ఆయన్ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇది ముందే ఊహించి కొరటాల శివ తన ట్విట్టర్ అకౌంట్‌ను డిలీట్ చేశారనే టాక్ కూడా వినిపించింది. బయ్యర్లను తీవ్రంగా నిరాశపరిచిన ఈ మూవీ మెగాస్టార్ కెరీర్‌లో భారీ డిజాస్టర్‌గా నిలిచింది. రాజకీయాలకు గుడ్‌బై చెప్పి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరుకు ఇంతటి డిజాస్టర్ రావడం ఇదే తొలిసారి.
అయితే ఆచార్య సినిమా ఫ్లాప్ అవుతుందని షూటింగ్ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి అంచనాకు వచ్చారని తాజాగా టాక్ వినిపిస్తోంది. ఈ కథ వర్కవుటక్ అవుతుందా అని దర్శకుడు కొరటాల శివను మెగాస్టార్ పదేపదే అడిగేవారని.. తన మీద నమ్మకం ఉంచాలని కొరటాల చెప్పేవాడని కొందరు మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు. జనరేషన్ మారినందున కొన్ని సన్నివేశాలు జనాలకు ఎక్కవని మెగాస్టార్ మొత్తుకునేవారని.. కానీ కొరటాల వినకుండా తనకు నచ్చినట్లు సినిమాను చుట్టేసి చేతులు దులుపుకున్నాడని ఆరోపిస్తున్నారు. చివరకు మెగాస్టార్ చిరంజీవి ఊహించినట్లే ఆచార్య సినిమా అభిమానులకు నచ్చలేదని పలువురు గుర్తుచేస్తున్నారు. ఆచార్య పరాజయానికి దర్శకుడు కొరటాల శివ కారణమని విమర్శిస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవికి జోడీ లేకుండా చేసింది కూడా కొరటాలేనని మండిపడుతున్నారు. టాలీవుడ్‌లో ఫేడ్ అవుట్ అయిపోయిన సంగీత దర్శకుడు మణిశర్మను తీసుకుని కొరటాల తొలి తప్పు చేశాడని.. బీజీఎం కూడా చెత్తగా వచ్చిందని అభిప్రాయపడుతున్నారు.
కాగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఓవర్సీస్‌లో కూడా మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఆచార్య సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ మంచి బిజినెస్ జరిగింది. ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత రామ్‌చరణ్ చేసిన సినిమా కూడా కావడం వల్ల ఆచార్యపై అంచనాలు మరింత పెరిగాయి. టాలీవుడ్‌లో అపజయం ఎరుగని కొరటాల శివతో చేసిన సినిమా కావడంతో ఆచార్య మూవీకి భారీ స్థాయిలో రూ. 131.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలా ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్ జరుపుకున్న సినిమాగా నిలిచింది. కానీ డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోవడంతో వాళ్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో ఓ డిస్ట్రిబ్యూటర్ మెగాస్టార్ చిరంజీవికి బహిరంగ లేఖ రాశాడు. ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కర్ణాటకలోని రాయ్‌చూర్ జిల్లాలో ఆచార్య మూవీ హక్కులను రాజ గోపాల్ బజాజ్ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. అయితే పెట్టుబడిలో 75 శాతం నష్టపోవడంతో తనకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చిరును కోరాడు. నష్టపరిహారం ఇస్తే సమీప భవిష్యత్‌లో మరిన్ని సినిమాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. మరి డిస్ట్రిబ్యూటర్ రాసిన ఈ లేఖపై చిరు స్పందించాల్సి ఉంది.