
సూపర్ స్టార్ మహేష్‌బాబు నటించిన సర్కారు వారి పాట మరో రెండు రోజుల్లో థియేటర్లలో విడుదల కాబోతోంది. కరోనాతో రెండేళ్ల పాటు సర్కారు వారి పాట షూటింగ్ ముందుకు కదల్లేదు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన సినిమా వాయిదా పడి ఎట్టకేలకు ఈ నెల 12న థియేటర్లలోకి వస్తోంది. మహేష్ ఓ వైపు ప్రమోషన్లను హోరెత్తిస్తున్నాడు. అటు పరశురాం కూడా మహేష్‌తో కలిసి ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. అయినా ఇన్ని చేసినా సర్కారు వారి పాట సినిమా గురించి అంత బజ్ కనిపించడం లేదు. ఇటీవల పెద్ద సినిమాలు వరుసగా రిలీజ్ కావడం ప్రేక్షకుల్లో ఆసక్తి లేకపోవడానికి కారణంగా కనిపిస్తోంది. మరోవైపు ఈ సినిమా బిజినెస్ కూడా అంతంత మాత్రంగానే జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను భారీ రేట్లతో హైర్స్ చేయడానికి బయ్యర్లు భయపడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య తీవ్రంగా నిరాశపరచడం దీనికి కారణంగా కనిపిస్తోంది.
అటు ఈ సినిమా బుకింగ్స్ కూడా అనుకున్న రేంజ్లో లేవని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. సాధారణంగా పెద్ద హీరో సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే వారం ముందు నుంచే ఆన్లైన్లో బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. కానీ సర్కారువారి పాట మూవీ మరో రెండు రోజుల్లో విడుదలవుతున్నా ఇంకా మల్టీప్లెక్స్ టిక్కెట్లు ఆన్లైన్లో పెట్టలేదు. కొన్ని మల్టీప్లెక్స్ వాళ్లు పెట్టినా ప్రేక్షకుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. హైదరాబాద్ నగరంలో మహేష్ సొంత థియేటర్ ఏఎంబీలో మాత్రం విడుదల రోజు అన్ని షోలను సర్కారు వారి పాటకే కేటాయించినట్లు కనిపిస్తోంది. ఆయా షోల టిక్కెట్స్ నిర్వాహకులు బ్లాక్ చేసినట్లు అభిమానులు చర్చించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో సర్కారు వారి పాట సినిమాకు రూ.96.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మధ్య పెద్ద సినిమాలన్నీ దాదాపుగా రూ.100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్న నేపథ్యంలో మహేష్ సినిమాకు జరిగిన బిజినెస్ తక్కువనే చెప్పాలి.
టాలీవుడ్లో యంగ్ జనరేషన్ దర్శకులలో పరశురాం దూసుకు పోతున్నాడు పరశురాం. యువత, ఆంజనేయులు, సోలో, గీతగోవిందం లాంటి సక్సెస్ ఫుల్, డిఫరెంట్ సినిమాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. గీతగోవిందం సినిమా చూసిన టాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా పరశురాంతో ఎలాగైనా ఒక్క సినిమా అయినా చేయాలని డిసైడ్ అయిపోయారు. అయితే మహేష్ ముందుగానే పరశురాంకు ఆ ఛాన్స్ ఇచ్చేశాడు. అయితే గీతగోవిందం తర్వాత మహేష్‌తో వర్క్ చేసేందుకు పరశురాంకు ఏకంగా నాలుగేళ్లు పట్టింది. అటు ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చివరగా విడుదలైన మాస్ సాంగ్ మ..మ.. మహేశాకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. మాస్ స్టెప్స్‌తో తెగ వైరల్ అవుతోంది. మహేష్ బాబు, కీర్తి సురేష్ కలర్ ఫుల్ కాస్టూమ్స్‌తో అదరగొట్టే స్టెప్స్‌తో వావ్ అనిపించారు. ఇక ఈ సినిమా సెన్సార్ పూర్తి అయ్యిందని తెలుస్తోంది. ఈ చిత్రం నిడివి కాస్తా ఎక్కువుగా ఉన్నట్లు తెలుస్తోంది. సర్కారు వారి పాట రన్ టైమ్ 160 నిమిషాలు అంటే దాదాపుగా 2 గంటల 40 నిమిషాలుగా ఉండనుందట. అంతేకాదు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ వచ్చిందని తెలుస్తోంది.